CM YS Jagan Strategy on Assembly Elections 2024: ఆ పథకాలే జగన్‌కు శ్రీరామరక్ష…!!
CM YS Jagan Strategy on Assembly Elections 2024:వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం తమదే అంటే తమదేనని అన్ని పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిందని, ఉద్యోగాల కల్పన, కొత్త పరిశ్రలు రావడం లేదని, రోడ్లన్నీ గోతులమయం అయ్యాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, ఏపీ సీఎం వైఎస్ జగన్ అవేమీ పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సంక్షేమపథకాలను అమలు చేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది నుండి పించన్‌ను రూ. 3000లకు పెంచనున్నారు. ఈ స్థాయిలో పించన్ ఇచ్చే రాష్ట్రంగాని, ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రంగాని దేశంలో లేదని, ఈ పథకాలే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా చేస్తాయని సీఎం వైఎస్ జగన్ సంపూర్ణంగా నమ్ముతున్నారు.
మహిళలను భాగస్వామ్యం చేస్తూ పథకాలను అమలు చేస్తుండటంతో మహిళా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విమర్శిస్తున్నారు. ఉచిత పథకాలతో పథకాలను అమలు చేస్తూ, రాష్ట్ర భవిష్యత్తును అంథకారంలో పడేస్తున్నారని, సంక్షేమం కోసం తీసుకొస్తున్న అప్పులను తిరిగి ప్రజలే చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఉచిత సంక్షేమ పథకాల కోసం ఆశపడితే, పిల్లల భవిష్యత్తు అంథకారంగా మారిపోతుందని అంటున్నారు. అభివృద్ది, పరిశ్రమల ఏర్పాటు జరిగినపుడే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని, భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వబోమని, వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసిరావాలని జనసేన పార్టీ సూచించింది.
ఇటీవలే మచిలీపట్నంలో జరగిన జనసేన పార్టీ పదో వార్షికోత్సవంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఓడించేందుకు కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా జనసేన పార్టీతో పాటు బీజేపీతో కలిసి వెళ్లాలని చూస్తున్నది. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా అధికారంలోకి రావొచ్చని చంద్రబాబు ఆలోచన. పవన్ సైతం ఒంటరిగా పోటీ చేసే ఆలోచనలో లేనట్టుగా చెప్పకనే చెప్పారు. సో, రాష్ట్రంలో ఎన్నికల సమయానికి టీడీపీ, జనసేన పార్టీల పొత్తులు దాదాపుగా ఖరారైనట్టే చెప్పాలి. బీజేపీతో ఎవరు కలుస్తారన్నది తెలియాల్సి ఉన్నది. అయితే, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకునేది లేదని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్షగా నిలుస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఓటర్ల మనసులో ఏమున్నదో, ఎవరు గెలుస్తారో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండటంతో పొత్తుల విషయంలో మార్పులు జరిగినా జరగొచ్చు. లేదా రాజకీయంగా పెనుమార్పులైనా జరగొచ్చు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించగలరు… అన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలలో ఎవరు గెలుస్తారో చూడాలి.