CM YS Jagan:మాండస్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మాండస్ తుఫాన్ ప్రభావంపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బాధితులను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎలా ఉన్నదనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్షసూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. ప్రత్యేకించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైన పక్షంలో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. మాండస్ తుఫాను ప్రస్తుతం రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా జిల్లాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది.