రోడ్ల పై సీఎం జగన్ కీలక సమీక్ష..అధికారులకు అల్టిమేటం
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ శాఖలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం సమీక్షించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. న్యాయ వివాదాలు లేని క్లియర్ టైటిల్స్ వినియోగ దారులకు ఉండాలన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ కోసం ఇప్పటివరకు 82 అర్బన్ నియోజకవర్గాల్లో సుమారు 6 వేల 791 ఎకరాలను గుర్తించినట్లు సీఎం తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్‌ఆర్, కర్నూలు శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో లే అవుట్ పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. అందుకోసం 864.29 ఎకరాలను సేకరించామన్నారు. ఈ ఎంఐజీ లే అవుట్‌లను త్వరిత గతిన పూర్తి చేయాలని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
మరోవైపు విశాఖ మెట్రో రైల్వే ప్రాజెక్టుపై కూడా సీఎం సమీక్షించారు. విశాఖలో సమారు 75 కిలో మీటర్ల మేర ఈ ప్రాజెక్టును నిర్మించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్‌ల డిజైన్, స్టేషన్‌లో ఉండే సదుపాయాల వంటి వివరాలను పూర్తిగా పరిశీలించి తనకు అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
దీంతో పాటు కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు సీఎం జగన్. ఇప్పటికే కరకట్ట సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించామని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో కరకట్ట పనులు వేగవంతం అవుతాయన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై కూడా దృష్టిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, అధికారుల క్వార్టర్స్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పోరేషన్, మున్సిపాలిటీ రోడ్లపై అధికారులు దృష్టా పెట్టాలని సీఎం తెలిపారు. ఎక్కడా గుంతలు ఉన్న రోడ్లు కన్పించవద్దన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా బాగు చేసిన రోడ్లను చూపించాలన్నారు. జూన్ నాటికి రోడ్ల పనులు పూర్తి కావాలని సీఎం అధికారులను ఆదేశించారు.