దావోస్ కు సీఎం జగన్..ముఖ్యమంత్రిగా తొలి విదేశీ అధికారిక పర్యటన..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా సీఎం హోదాలో అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మే 22న దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌లో జగన్ పాల్గొననున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు పలు పారిశ్రామిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తుంది.
సీఎం జగన్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ నుంచి ఆహ్వానం అందినట్లు సీఎం కార్యాలయ వర్గం తెలిపింది. గత రెండేళ్లుగా కరోనా వల్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు వర్చువల్‌గా జరిగాయి. ఈ ఏడాది కరోనా తగ్గడంతో సమావేశాను ప్రత్యక్షంగా నిర్వహించాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం కమిటీ నిర్ణయించింది. గత ఏడాది భారత పర్యటనకు వచ్చిన ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్డే బ్రెండే ఢిల్లీలో మేకపాటిని కలిశారు. మేకపాటి ద్వారా సీఎంకు ఆహ్వానం పంపారు. దీంతో వచ్చే నెలలో 17 మంది సభ్యులతో కూడిన జగన్ బృందం దావోస్‌కు వెళ్లనుంది. అక్కడ పలు పారిశ్రామిక సంస్థలతోనూ అధికారులు సమావేశం కానున్నారు.