CM Jagan: గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నన్ను ఉప్పొంగేలా చేసింది – సీఎం జగన్
CM Jagan Concluding Speech at GIS 2023
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 రెండోరోజు సదస్సులో ముగింపు ఉపన్యాసం చేసిన సీఎం వైయస్.జగన్ అనేక కీలక విషయాలు వెల్లడించారు. వివిధ దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులు మరియు పారిశ్రామిక ప్రతినిధులు, అధికారులందరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.
విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సు ద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసం నన్ను ఉప్పొంగేలా చేసిందని సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వృద్ధిచెందేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు నిర్వహించే కార్యకలాపాలకు మా నుంచి చక్కటి మద్దతు, సహకారం ఉంటుందని తెలిపారు. మీతో మా బంధం చాలా అమూల్యమైనదని అన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత సానుకూల వాతావరణం కల్పించడానికి రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సు అద్భుతంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేకాదు ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి ఈ సదస్సు కల్పించిన వాతావరణం ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ శర వేగంతో తిరిగి పుంజుకుందని తెలిపారు.
కోవిడ్ మహమ్మారి విస్తరించి, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైన పరిస్థితుల్లో కూడా అనేక రంగాలకు మా ప్రభుత్వం సమయాను కూలంగా ప్రోత్సాహం ఇచ్చిందని గుర్తుచేశారు. సుపరిపాలన, సమర్థవంతమైన విధానాలు ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలవడమే కాకుండా ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచిందని తెలిపారు. అంతేకాకుండా వ్యాపారాలు ప్రమాదంలో పడకుండా చూసింది. ఇదే సమయంలో పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారస్తులకు మరింత సానుకూల వాతావరణాన్ని కల్పించడానికి కోవిడ్ సమయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాం. మౌలికసదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా, ఇంటర్నెట్, బ్రాడ్ బాండ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చి యువతలో నైపుణ్యాలను మరింత బలోపేతం చేశామని తెలిపారు.
అత్యంత కీలక సమయంలో ఈ సదస్సును నిర్వహించాం. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించడంలో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు.