CM Jagan : సీఎం జగన్ సవాల్..చంద్రబాబు – పవన్ సిద్దమేనా
CM Jagan Challenge for Chandra Babu And Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కు ఛాలెంజ్ చేసారు. వచ్చే ఎన్నికల్లో తాను 175 సీట్లు గెలుస్తానని ఛాలెంజ్ చేస్తున్నానని.. ఈ సవాల్ స్వీకరించే దమ్ము ఆ ఇద్దరు నేతలకు ఉందా అని ప్రశ్నించారు. తనకు భయం లేదని అందుకే సవాల్ చేస్తున్నానని చెప్పారు. ఆ ఇద్దరికీ ఛాలెంజ్ చేసే ధైర్యం లేదని, వాళ్లు ఎప్పుడూ ప్రజలకు మంచి చేయలేదన్నారు. దమ్ముంటే 175 సీట్లలో గెలుస్తామని చంద్రబాబు- పవన్ చెప్పాలని ఛాలెంజ్ విసిరారు. మూడో విడత వైయస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ సాయాన్ని సీఎం వైయస్ జగన్ విడుదల చేసారు. అదే విధంగా మాండూస్ తుపాన్ బాధితులకు రూ.76.99 కోట్ల పరిహారాన్ని అందజేసారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98.5 శాతం పూర్తి చేసి ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తున్నానని జగన్ పేర్కొన్నారు. తనకు వాళ్ల లాగా మీడియా, దుష్ఠ చతుష్టయం మద్దతు లేకపోయినా.. ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. అందుకే ధైర్యంగా 175 సీట్లకు 175 టార్గెట్ అని స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికలు కులాల మధ్య కాదని పెత్తందార్లు – పేదల మధ్య యుద్దంగా జగన్ పేర్కొన్నారు. కరువుతో ఫ్రెండ్ షిప్ చేసే చంద్రబాబు..వరుణదేవుడి ఆశీస్సులు ఉన్న తమ ప్రభుత్వానికి మధ్య యుద్దంగా అభవిర్ణించారు. చంద్రబాబు హయాంలో ప్రతీ ఏటా కరువు ఉండేదని..తన పాలనలో నాలుగేళ్లుగా ఒక్క మండలంలోనూ కరువు లేదన్నారు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకోవటమే పనిగా పని చేసారన్నారు.
ఇప్పుడు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 1.93 లక్షల కోట్ల నేరుగా లబ్ది దారుల ఖాతాల్లో జమ చేసామని వివరించారు. ఇదే రాష్ట్రం..ఇదే బడ్జెట్ అయినా గత ప్రభుత్వంలో చంద్రబాబు ఎందుకు ఈ పథకాలు అమలు చేయలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పొరపాటు జరిగినా పేదవాడు బతకలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ అవుతాయన్నారు. ఓటు పైన నిర్ణయం తీసుకునే ముందు ఆలోచన చేసి తీసుకోండని సూచించారు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది ప్రామణికంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. మీకు మంచి జరిగితే తనను ఆశీర్వదించాలని, నమ్మితే తోడుగా నిలవాలని సీఎం జగన్ కోరారు.