Target 175 : మరో అభ్యర్ధిని ప్రకటించిన జగన్ – కొడితే 30 ఏళ్లు మనమే..
CM Jagan Announces Devineni Avinash As YSRCP Vijayawada East Candidate: ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికలకు మరో అభ్యర్ధిని ఖరారు చేసారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సారి ఎన్నికల్లో అధికారం కొడితే 30 ఏళ్లు తిరుగులేదని మరోసారి స్పష్టం చేసారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంపై జగన్ సమీక్ష చేసారు. పార్టీ నేతలతో పలు అంశాలను పంచుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 88 శాతం మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. గతంలో 151 గెలిస్తే, ఈ సారి 152 సీట్లు లక్ష్యం కాదన్నారు. 175 సీట్లు గెలవాల్సిందేనని స్పష్టం చేసారు. ప్రతీ ఇంటికి ప్రతీ నేత వెళ్లాలని, వారితో మమేకం కావాలని నిర్దేశించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ అభ్యర్ధిగా దేవినేని అవినాశ్ పోటీ చేస్తారని జగన్ ప్రకటించారు.
పార్టీ లో ప్రతీ ఒక్కరూ అవినాశ్ కు సహకరించాలని సీఎం స్పష్టం చేసారు. దేవినేని అవినాశ్ 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గుడివాడ అభ్యర్దిగా కొడాలి నాని పైన పోటీ చేసారు. 2019 ఎన్నికల తరువాత వైసీపీలో చేరారు. విజయవాడ తూర్పు బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు అక్కడ టీడీపీ నుంచి గద్దే రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయవాడ ఎంపీగా పని చేసిన గద్దే రామ్మోహన్ 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి గెలిచారు. టీడీపీ 2019లో గెలిచిన నియోజకవర్గాల్లో ముందుగా ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలకు భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేసారు. 2019 ఎన్నికల్లో విజయవాడలో పశ్చిమ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు గెలుపొందారు. తూర్పు నియోజకవర్గం టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. తిరిగి టీడీపీ నుంచి గద్దే రామ్మోహన్ లేదా ఆయన సతీమణి అనురాధ విజయవాడ తూర్పు అభ్యర్ధిగా బరిలో ఉండే అవకాశం ఉంది. 2004లో వంగవీటి రాధా ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2009లో అవినాశ్ తండ్రి దేవినేని నెహ్రూ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడారు. ఆ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన యలమంచిలి రవి విజయం సాధించారు. అదే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గద్దే రామ్మోహన్ మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు తన తండ్రి ఓడిన స్థానంలో అవినాశ్ వైసీపీ నుంచి రెండో సారి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి తిరిగి సిట్టింగ్ లకే ఛాన్స్ దక్కనుంది. టీడీపీ నుంచి విజయవాడ పశ్చిమం నుంచి తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రకటించారు. సెంట్రల్ ఇంఛార్జ్ గా బోండా ఉమా ఉన్నారు. వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నా, ఎన్నికల నాటికి ఆయన టీడీపీలో కొనసాగుతారా జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా అనే చర్చ నియోజకవర్గంలో ఉంది. 2019 ఎన్నికల్లో సెంట్రల్ సీటు దక్కని కారణంగా రాధా వైసీపీని వీడారు.
ఇప్పుడు రాధాను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ఆయన మిత్రుడు మాజీ మంత్రి కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారు. రాధా జనసేన నుంచి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలుస్తోంది. రాధా కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తుండగా, జనసేనతో పొత్తు ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రాధా భావిస్తున్నట్లు సమాచారం. పొత్తు ఉంటే రాధాకు సెంట్రల్ కేటాయించాల్సి ఉంటుంది. ఆ సమయంలో బోండా ఉమా కు ప్రత్యామ్నాయంగా ఏ హామీ ఇస్తారనేది చూడాలి. ఇప్పుడు విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధిగా ఇంఛార్జ్ పోతిన మహేష్ సీటు ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ, జనసేన పొత్తు నిర్ణయం కోసం ఇక్కడి రెండు పార్టీల నేతల్లో ఆసక్తి కనిపిస్తోంది. వైసీపీ కి విజయవాడ నగరానికి చెందిన ముగ్గురు అభ్యర్ధుల పైన దాదాపు క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది.