Mission 2024: సీఎం జగన్ నినాదాలు ..చంద్రబాబు వ్యూహాలు..
AP CM Jagan and Chandra Babu Moving with New Strategies for 2024 Elections: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 14 నెలల సమయం ఉంది. కానీ, ఇప్పటికే ఎన్నికల వాతావరణం హాటెక్కుతోంది. ముఖ్యమంత్రి జగన్ కొత్త నినాదాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చంద్రబాబు తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. పొత్తుల రాజకీయం పైన క్లారిటీ రాలేదు. పవన్ కల్యాణ్ తానే సీఎం అంటున్నారు. బీజేపీ పాత్ర పై అస్పష్టత కొనసాగుతోంది. సీఎం జగన్ వై నాట్ 175 అంటూ ధీమాగా ఉన్నారు. చంద్రబాబు వంద శాతం తమదే అధికారమంటూ విశ్వాసంతో కనిపిస్తున్నారు. ఈ సారి అధికారం వస్తే మరో 30 ఏళ్ల పాలన తమదేనని ప్రతీ సందర్భంలో జగన్ పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ నేతలను చంద్రబాబు అప్రమత్తం చేస్తున్నారు. అసెంబ్లీలో తాను చేసిన శపథం గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వస్తేనే తాను అసెంబ్లీకి వచ్చేదని గుర్తు చేస్తున్నారు. ఇందుకోసం ఇవే తనకు చివరి ఎన్నకలని ఒకసారి, రాష్ట్రానికి ఈ ఎన్నికలే లాస్ట్ అని మరోసారి ప్రజల్లో నినదించారు.
ఇప్పుడు పూర్తిగా తన ఎన్నికల విజన్ స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ధీటుగా సీఎం జగన్ కొత్త నినాదం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి లబ్దిదారులపైనే జగన్ ఆధారపడ్డారు. ప్రతీ ఇంటికి అందిన సంక్షేమంతో మంచి జరిగిందని పాజిటివ్ ఆలోచన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా రాష్ట్రంకు జరిగిన మేలు, అభివృద్ధి ప్రస్తావన చేయటం లేదు. రాష్ట్రంలో 87 శాతం మందికి పథకాలు అందుతున్నాయని, ఇప్పటికే మూడున్నార లక్షల కోట్ల మందికి మేలు జరిగిందని వివరిస్తున్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో పథకాలు వద్దనే వారు టీడీపీకి ఓటు వేస్తారు.. కొనసాగాలని కోరుకొనే వారు వైసీపీకి మద్దతు గా నిలుస్తారంటూ ప్రచారం ప్రారంభించారు. దీంతో పాటుగా వచ్చే ఎన్నికలు పేదవారికి ..పెత్తందార్లకు మధ్య ఎన్నికలుగా సీఎం జగన్ అభివర్ణిస్తున్నారు. తాను పేదల పక్షాన నిలిచానని, చంద్రబాబు అండ్ కో పెత్తందార్లకు అండగా ఉందని ప్రజల మధ్య విశ్లేషణ చేస్తున్నారు.
తాను నలుగురినే నమ్ముకున్నానంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలని పదే పదే చెబుతున్నారు. ఇటు చంద్రబాబు వైసీపీ పాలనలో రాష్ట్రం నష్టపోయిన అంశాలను వివరిస్తున్నారు. అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తానని చెబుతూనే, సంక్షేమం ఇంతకంటే మెరుగ్గా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. 2019 లో జగన్ అమలు చేసిన ఫార్ములానే ఇప్పుడు ఫాలో అవుతున్నారు. బీసీలను జగన్ ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తుండటంతో, జిల్లాల పర్యటనల్లో ప్రత్యేకంగా బీసీ వర్గాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీ వర్గాలు, టీడీపీకి ఉన్న అనుబంధాన్నివివరిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తిరిగి కలిసివస్తే బీజేపీ, జనసేనతో లేకుంటే పవన్ తో కలిసి ఎన్నికలకు వెళ్లటం ద్వారా విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే గోదావరి జిల్లాల్లో చంద్రబాబు ..పవన్ కాంబినేషన్ తో సామాజిక వర్గాల వారీగా వైసీపీ పైన పడే ప్రభావం పైన జగన్ కు స్పష్టమైన అంచనా ఉంది.
అక్కడ పక్కగా సోషల్ ఇంజనీరింగ్ అమలుకు సిద్దం అవుతున్నారు. జనసేన ప్రధానంగా ఆధారపడుతున్న ఓట్ బ్యాంకు వ్యతిరేక వర్గాలను తాను సొంతం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం సైలెంట్ ఆపరేషన్ మొదలైంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాను అమలు చేస్తున్న సామాజిక న్యాయం ఓట్లుగా మారుతుందని జగన్ విశ్వసిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఏ వర్గం ఏ పార్టీ వైపు మద్దతుగా నిలుస్తుందనే చర్చ మొదలైంది. వైసీపీ ఏర్పాటు సమయంలో కడప ఉప ఎన్నికల్లో కడప పౌరుషానికి.. ఢిల్లీ అహంకారినికి మధ్య ఎన్నికగా జగన్ ప్రచారం చేసి 5.43 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ నినాదంతో ప్రజలకు దగ్గరయ్యారు. ఇప్పుడు పేదలు..పెత్తందార్లు అనే స్లోగన్ మొదలు పెట్టారు. దీంతో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా..ఈ నినాదాల ఎఫెక్ట్ ప్రజల మీద ఏ స్థాయిలో ప్రభావం చూపుతాయనేది రాజకీయ వర్గాల్లో బిగ్ డిస్కషన్ గా మారుతోంది.