Three Captials: జగన్ ‘మూడు’ మార్చలేరు.. విశాఖ నుంచే పాలన..?
CM Jagan Ready to Start Administration from Vizag :సరిగ్గా మూడు సంవత్సరాల రెండు నెలలు అవుతోంది.. అయినా ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘మూడు’ ఏమాత్రం మారలేదు. విశాఖపట్నం కేంద్రంగా పరిపాలనకే జగన్ సిద్ధపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏ ముహూర్తాన ఏపీ అసెంబ్లీలో సీఎం హోదాలో జగన్ విశాఖ పట్నం, అమరావతి, కర్నూలు అంటూ మూడు రాజధానుల ప్రకటన చేశారో కాని.. అప్పటినుంచి అన్నీ అడ్డంకులే. 2019 నవంబరులో వైఎస్ జగన్ నోటి నుంచి ‘ఏపీకి ఒకటి కాదు మూడు రాజధానులు’ అంటూ దక్షిణాఫ్రికా మోడల్ ను గుర్తుచేస్తూ ప్రకటన వెలువడింది. కానీ, మరికొద్ది రోజుల్లోనే కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది. 2020 ప్రారంభంలో కొవిడ్ వ్యాప్తి చాపకింద నీరులా మొదలై.. దేశ వ్యాప్త సుదీర్ఘ లాక్ డౌన్ వరకు వెళ్లింది. ఆ ఏడాది జూలై తర్వాత కాని అన్ లాక్ ప్రక్రియ పూర్తి కాలేదు. అంటే ఆర్నెల్ల కాలం పోయింది. అయితే, మరో ఆర్నెల్లకు అటుఇటుగానే సెకండ్ వేవ్ మొదలై ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున పొట్టన పెట్టుకుంది. అది సద్దుమణిగిందో లేదో థర్డ్ వేవ్ వెంటాడింది. ఇదంతా వదిలేటప్పటికి 2022 మధ్యలోకి వచ్చింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా, జగన్ కు మొదటినుంచి విశాఖ పట్నం విషయంలో చుక్కెదురవుతూనే ఉంది.
2014లో ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ కుటుంబానికి రాజకీయాల్లో ఇదే తొలి ఓటమిగా నిలిచింది. అనంతరం విశాఖలో పెట్టుబడుల సదస్సు జరుగుతుండగా నల్ల చొక్కాలతో వెళ్లిన జగన్ ను విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే నిరసనకు దిగారు. ఇక జగన్ పాదయాత్రలో ఉండగా విశాఖపట్నం విమానాశ్రయంలో కోడి కత్తి దాడి జరిగింది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం వీచినా.. ఆ పార్టీకి విశాఖలో పెద్దగా సీట్లు రాలేదు. మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం జగన్ పాలనలోనే తెరమీదకు వచ్చింది. ‘‘ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు’’ నినాదంతో ఎందరో ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం అంటే సెంటిమెంట్ తో ఆడుకోవడడమే. ఇప్పటికీ కేంద్రం ప్రయివేటీకరణకు మొగ్గు చూపుతోంది. దీనిపై టీడీపీ, జన సేన గట్టి ప్రతిఘటన వ్యక్తం చేశాయి. అధికార వైసీపీ మాత్రం మింగలేక కక్కలేక సతమతం అవుతోంది. కాగా, ఇటీవల జన సేన అధినేత పవన్ కల్యాణ్ ను విశాఖలో ప్రభుత్వం అడ్డుకోవడం ఎంత సంచలనం రేపిందో అందరూ చూశారు. పవన్ ను గంటల కొద్దీ హోటల్ రూమ్ కు పరిమితం చేయడం చర్చనీయాంశం అయింది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకూ దారితీసింది. అలా.. జగన్ కు విశాఖతో విరోధం ఏదో ఉన్నట్లు అనిపిస్తోంది.
ఏపీ మూడు రాజధానుల అంశమై సుప్రీం కోర్టులో కేసు ఉంది. దీని విచారణ ఈ నెలాఖరులో జరిగి తీర్పు వెలువడేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు కోర్టుల చేతిలో మొట్టికాయలు తిన్న జగన్ సర్కారుకు సుప్రీంలోనూ వ్యతిరేక తీర్పు వస్తే ఏం చేస్తారన్నది ప్రశ్నగా మిగిలింది. వాస్తవానికి ఏపీలో ఏడాది దూరంలోనే ఉన్నాయి. అన్ని పార్టీలకు ఈ వ్యవధి ఎంతో కీలకం. అభివ్రద్ధి కంటే సంక్షేమాన్నే నమ్ముకున్న అధికార వైసీపీకి మరింత ముఖ్యం. విశాఖను పాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి మూడు ప్రాంతాల అభిమానం చూరగొనాలన్న తొలి ఏడాది ప్రయత్నం.. వైసీపీ పాలన చివరకు వచ్చినా సాకారం కాలేదు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వచ్చినా జగన్ విశాఖ రాజధానిగా ముందుకే వెళ్తారనే వాదన సాగుతోంది. ఈ మేరకు పాలనకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు వస్తున్నాయి. అంటే 2024లో జరిగే ప్రజా తీర్పు, 2023 జనవరిలో వచ్చే న్యాయ స్థానం తీర్పునకు ముందే ఆయన విశాఖలో కొలువుదీరబోతున్నారు. తద్వారా పంతం నెగ్గించుకున్నట్లుగా చూపనున్నారని తెలుస్తోంది.
తమ కలల రాజధాని అమరావతిని జగన్ ప్రభుత్వం కళ్లెదుటే ఛిద్రం చేస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి ఇన్నాళ్లూ టీడీపీది. చంద్రబాబు ఎంతో ఇష్టపడి ‘‘అమరావతి’’ పేరిట నిర్మాణం తలపెట్టి, కొన్ని వేలకోట్ల రూపాయిలను ఖర్చుచేసిన చోటు ఇప్పుడు కేవలం నామమాత్రంగా మిగిలింది. కేంద్రంలోనూ మద్దతు లేకపోవడంతో.. జగన్ సర్కారు చేష్టలను చూస్తూ ఉండిపోయింది. అయితే, సుప్రీం పైనే ఇప్పుడు ఆశలన్నీ పెట్టుకుంది. అక్కడ తీర్పు ఎలా వచ్చినా.. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నందున ప్రజా క్షేత్రంలో తేల్చుకోవచ్చనే ఆశావహ ధోరణిలో ఉంది. ఒకవేళ మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు వచ్చి.. మరో ఏడాదిలో టీడీపీ సర్కారు వచ్చాక ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని నిర్ణయిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటో…