నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు
నెల్లూరు జిల్లాలోని వైసీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేకున్నాయి. రేపు మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. మరో కార్యక్రమం కోసం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు రానున్నారు. దీంతో ఒకే రోజు రెండు వేర్వేరు కార్యక్రమాలు ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు రేపటి కార్యక్రమంపై మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ స్పందించారు. తాను బల ప్రదర్శన కోసం ఈ సమావేశం నిర్వహించడంలేదని, కేవలం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలపడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు నెల్లూరు నగరంలోని కార్యకర్తలు మాత్రమే వస్తారని తెలిపారు. ఈ సభ ఎవరికీ పోటీకాదన్నారు. సభకు మూడు రోజుల ముందే అనుమతి తీసుకున్నామన్న అనీల్.. దీనిని కొందరు వివాదంగా చిత్రీకరిస్తున్నారని మండి పడ్డారు.