Chandrababu Tour: రెండు రోజుల పాటు పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు
Chandrababu Tour Schedule: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన కొనసాగుతోంది. ఇటీవల లంక గ్రామాల్లో పర్యటించిన చంద్రబాబు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు పోలవరం పరిసరాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు బాబు బయలు దేరనున్నారు. మొదటి రోజు పోలవరం ప్రాంతంలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పర్యటించనున్న టీడీపీ అధినేత.. వరద బాధితులను పరామర్శించి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకోనున్నారు.
అనంతరం చంద్రబాబు నాయుడు భద్రాద్రి జిల్లాలోని బూర్గంపాడు సమీపంలోగల ముంపు ప్రాంత ప్రజలను కలవనున్నారు. అక్కడ ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. ఇటీవలే తమను తెలంగాణలో కలపాలని బూర్గంపాడు ప్రజలు ఆందోళన చేయడంతో చంద్రబాబు వారిని కలవనున్నట్లు సమాచారం. రేపు రాత్రి భద్రచలం వెళ్లనున్న బాబు అక్కడే బస చేయనున్నారు. తన పర్యటనలో భాగంగా రెండో రోజు ఎటవాక, కూనవరం, విఆర్‌పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, రేఖపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు.