Chandrababu : వారికి ప్రజలు గడ్డి తినిపించాలి
TDP Chief Chandrababu Visits Velerupadu flood affected areas : ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని శివకాశీపురం, కుక్కునూరులో వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వస్తున్నా అనే ముఖ్యమంత్రి వరద ప్రాంతాలకు వచ్చారని అన్నారు. వున్న ఇంటిని వదిలి వరద బాధితులు ఎంత కష్టంలో వున్నారో తాను అర్దం చేసుకోగలను అని తెలిపారు. ఇక 2 వేల రూపాయలతో బాధితుల కష్టాలు తీరవని, బాధితులు చాలా కష్టాల్లో వుంటే సీఎం పుండు మీద కారం చల్లాడని, నేను పోలవరం కట్టలేనని చేతులెత్తేశారని చంద్రబాబు సీఎం వరద ప్రాంతాల పర్యటనపై విమర్శలు గుప్పించారు. ప్రాజెక్ట్ వల్ల నష్ట పోయే వారికి న్యాయం చేయాలని తన ఆకాంక్ష అని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు.
ఇక ఇల్లు కట్టిస్తే ఈ వరద కష్టాలు పోతాయని బాధితులు చెబుతున్నారని, వెయ్యి, రెండు వేల కోట్లు అయితే ఇస్తా… 20 వేల కోట్లు అయితే నేను ఇవ్వలేను అని సీఎం అంటున్నారని గుర్తు చేసిన చంద్రబాబు మరి ఎందుకు హామీ ఇచ్చారు? అంటూ సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు. సీఎం పరామర్శకి వచ్చినపుడు పేటీయం బ్యాచ్ చప్పట్లు కొట్టారని ఎద్దేవా చేసిన ఆయన పేటియం బ్యాచ్, కోడి కత్తి కమలహాసన్ ఇక్కడికి వచ్చి, నిజమైన బాధితుల పరిస్థితి చూడండి అని సూచించారు. పశువులకు వేసే గడ్డి విశ్వసనీయత లేని వారికి ప్రజలు తినిపించాలి అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఓట్ల కోసం పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి ప్రజలు కష్టాల్లో వుంటే మాత్రం గాల్లో తిరిగారని విమర్శించారు.
కాగా చంద్రబాబు కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, రాత్రికి భద్రాచలంలో బస చేస్తారు. తెలంగాణలోని ఏపీలో విలీనమైన ఏటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లిలో శుక్రవారం ఆయన పర్యటించనున్నారు.