Chandrababu Naidu: పీలేరు జైలులో టీడీపీ కార్యకర్తలకు పరామర్శ
Chandrababu Naidu: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్లలో ఓ ఫ్లెక్సీ వివాదంలో 11 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేసి అన్నమయ్య జిల్లా పీలేరు సబ్‌జైలుకు తరలించారు. జైలులో ఉన్న కార్యకర్తలను చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం సబ్‌జైలు ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలను అక్రమంగా, అన్యాయంగా కొట్టిన ఏ పోలీసునూ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. పుంగనూరు నియోజకవర్గం లో కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు. ఏడుగురు మైనారిటీ సోదరులపై కేసులు పెట్టారు. అయ్యప్ప భక్తుడిపైనా కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఇంటర్మీడియట్ చదువుతున్న యువకుడిపై కేసు పెట్టారు. ఏ కారణాలూ లేకుండా ఎఫ్ఐఆర్ లో ఇతరులు అని చేర్చి 8 మందిని అక్రమంగా అరెస్టు చేశారు. అరెస్టు చేసిందే కాక స్టేషన్ కు తీసుకొచ్చి వారి ని హింసించారు. వారిని కొట్టి భయపెట్టి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. మెజిస్ట్రేట్ వద్ద కొట్టినట్లు చెప్తే కాల్చేస్తాం..కేసులు పెట్టి తిప్పుతాం అని బెదిరించారు. దీనకంటే ఉగ్రవాద చర్య మరొకటి ఉంటుందా.? పోలీసులకు ఎవరిచ్చారు ఈ హక్కు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తుందన్నారు.
కొంతమందిచేష్టల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. అధికార పార్టీ నాయకులు వందలాదిమంది రోడ్ల మీదకు వచ్చినా చట్టాలు గుర్తుకు రావు. అదే టీడీపీ వాళ్ళు గడప దాటితే అరెస్ట్ చేద్దాం అన్నట్లు కాచుకుకూర్చున్నారు పోలీసులు.. నిష్పక్షపాతంగా చట్టప్రకారం పనిచేయాలి. లేకుంటే లక్షలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడే రోజు ముందుంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు.