Chandrababu Slams Government on Ippatam Issue: ఏపీలోని మంగళగిరి తాలూక ఇప్పటం గ్రామంలో కూల్చివేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి ఇలా దిక్కుమాలిన పనులు చేస్తోందని విమర్శించారు. శిశుపాలుడిలా జగన్ రెడ్డివి వంద తప్పులు దాటాయని… ఇక మిగిలింది ప్రభుత్వ పతనమేనని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే కూల్చివేతలు, అడ్డగింత, అక్రమ అరెస్టులు అన్నట్టుగా మార్చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అహంకారానికి, అధికార మదానికి జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. 600 ఇళ్లు ఉన్న ఇప్పటం గ్రామంలో 120 అడుగులకు రోడ్డు విస్తరిస్తారా? మీవి రోడ్లు వేసే మొహాలేనా? అంటూ నిలదీశారు. ‘ఇప్పటం గ్రామం వెళుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను అడ్డుకుంటే, చీకట్లో మా పర్యటనపై రాళ్లు వేస్తేనో మీరు పైచేయి సాధించలేరు’ అని చంద్రబాబు ఈ సంధర్భంగా పేర్కొన్నారు.. ఇకనైనా కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి… ఆ తృప్తి ఏంటో అర్థమవుతుంది అని హితవు పలికారు.