Kapunadu: పవన్ కు కాపునాడు సపోర్ట్.. మీటింగ్ ఇలా కలిసొచ్చిందా?
Chandrababu – Pawan Meeting : టిడిపి అధినేత చంద్రబాబుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన నివాసానికి వెళ్లి మరీ కలవడం ఇప్పుడు వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. పైకి ఎన్ని చెబుతున్నా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కలిసి పోటీ చేస్తే తమకు నష్టం తప్పదనే విషయం వైసీపీ నేతలకు బాగా తెలుసు. అందుకనే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు మధ్య దూరం పెంచేందుకు వారు మాట్లాడని మాటలంటూ లేవు, వారిద్దరూ భేటీ అయ్యారు అని తెలిసిన వెంటనే అనేక రకాల కామెంట్లతో మంత్రులు ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని కొందరు అంటే సంక్రాంతి సందర్భంగా గంగిరెద్దులా చంద్రబాబు చెప్పింది విని తల ఊపడానికే పవన్ వెళ్లాడని మరికొందన్నారు. ఇలా ఒక రేంజ్ లో కాపులకు కూడా పవన్ కళ్యాణ్ ద్రోహం చేస్తున్నాడు అనే విధంగా కామెంట్లు చేశారు.
దానికి తోడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా కాపులను పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నాడని మరోసారి గంప గుత్తగా కమ్మలకి అమ్మేశాడని అంటూ ట్వీట్ చేశారు. అయితే ఒక రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లడం కాపులకు కూడా నచ్చలేదని వాదనలు వినిపిస్తున్న తరుణంలో అదేమీ లేదని పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న తమకేమీ అభ్యంతరం లేదు అని అర్థం వచ్చేలా కాపునాడు నేతలు రాంగోపాల్ వర్మ మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాంగోపాల్ వర్మ నువ్వు నీ ప్యాకేజీల కోసం కాపుల మీద కామెంట్లు చేస్తే చెప్పు తీసుకుని కొడతామంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించారు. కాపులను రాజకీయ కారణాలతో విభజించాలనే కుట్ర జరుగుతోందని విద్వేషాలు రెచ్చగొట్టాలని వైసీపీ నేతలు వర్మ లాంటి ఊర కుక్కలను వదులుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక గత ఎన్నికల్లో జగన్ కాపుల కోసం ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని నిజంగా కాపు జాతి మీద అంత ప్రేమ ఉంటే ఏకంగా జగన్ ను నిలదీయమని రామ్ గోపాల్ వర్మను వారు డిమాండ్ చేస్తున్నారు. రాంగోపాల్ వర్మకి ఎలాంటి సిగ్గు శరం లేదని జగన్ దగ్గర ప్యాకేజీ తీసుకొని ఏది పడితే అది వాగుతున్నాడని వారు విమర్శించారు. వర్మ నోరు అదుపులో పెట్టుకో గతంలో వంగవీటి మోహనరంగా మీద సినిమా తీసి డబ్బులు సంపాదించావు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకుంటే నీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం వెంటనే నువ్వు కాపు ప్రజలను గురించి మాట్లాడిన పోస్ట్ వెనక్కి తీసుకొని కాపు జాతికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చూస్తున్న వర్గం మీద కేసు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసినా కాపునాడు నేతలు స్వాగతించేలానే కనిపిస్తున్నారు. అయితే కాపునాడు నేతలు జనసేన పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా లేక నిజంగానే జగన్ తమను మోసం చేశాడని భావిస్తూ ఇలా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ కాపు ఓట్లను చీల్చడానికి వైఎస్ జగన్ కేసీఆర్ తో కలిసి తోట చంద్రశేఖర్ ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారనే కొత్త వాదన కూడా తెరమీదకు వచ్చింది. ఇలాంటి తరుణంలో కాపునాడు నేతలు పవన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడటం జనసేనకు కాస్త కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.