Chandrababu : ద్రౌపది ముర్ముకు టీడీపీ సపోర్ట్
Chandrababu Naidu Meeting with Draupadi Murmu : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నేడు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ద్రౌపది ముర్ము పేద కుటుంబంలో పుట్టిన ఆదివాసీ మహిళ అని, అంచెలంచెలుగా ఎదిగి త్వరలో రాష్ట్రపతిగా ఎంపిక కానున్నారని, ముర్ము మన పక్క రాష్ట్రానికి చెందిన మహిళ కావటం మన అదృష్టంగా భావించాలని అన్నారు. ఇక మర్మును రాష్ట్రపతి అభ్యర్థినిగా ఎంపిక చేసిన మోదీకి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడిన వర్గాల వారిని వున్నత పదవుల్లో ఎంపిక చేసిన ఘనత టిడిపిదని, ముర్ముకు టిడిపి తరపున పూర్తి సహకారం అందిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికలో భాగస్వామ్యం కావడం అందరి అదృష్టమని, సామాజిక న్యాయం కోసం ముర్మును బలపరిచాలని టీడీపీ నిర్ణయించిందని చంద్రబాబు వెల్లడించారు. గతంలో అబ్దుల్ కలాం, రామ్నాథ్ కోవింద్ ఎన్నిక వేళ సైతం మద్దతిచ్చామని గుర్తు చేశారు.
కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపినందుకు చంద్రబాబుకు ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. ముర్ము మాట్లాడుతూ “నేను మీ పక్క రాష్ట్ర మహిళను, ఆదివాసి మహిళను. నాకు రాష్ట్రంలో టిడిపి పార్టీ మద్దతు ఇవ్వడం అనందంగా వుంది. చంద్రబాబు నాయుడుకు నా ప్రత్యేక ధన్యవాదాలు” అని అన్నారు.
ఇక చంద్రబాబుతో భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి,మార్గాని భరత్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బీజేపీ నేతలు జి. వి.యల్.నరసింహా రావు, సోము వీర్రాజు వారికి వీడ్కోలు పలికారు.