Chandrababu Naidu Fires on YSRCP: అడ్డంకులు సృష్టించినా ఆగదు.. రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తాం
Chandrababu Naidu Fires on YSRCP: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన లీగల్ సెల్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మెడపై కత్తిపెట్టి ఆస్తులను లాక్కుంటోందని, ఇలాంటి పరిస్థితులున్న రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా వస్తాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం జగన్ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, ఆయన నుండి వైసీపీ నేతలను కూడా తాము రక్షించాల్సి వస్తోందని అన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు, సుబ్బారావు గుప్తాలే ఇందుకు ఒక నిదర్శనమని అన్నారు. వైసీపీ నేతలు సైతం జగన్ దెబ్బకు కుదేలవుతున్నారని విమర్శించారు. ఎవరు ఎదురు ప్రశ్నించినా కేసులు బనాయిస్తున్నారని అన్నారు.
వైసీపీ పాలనకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. యువగళం కార్యక్రమాన్ని వైసీపీ అడ్డుకుంటోందని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు అడ్డుపడినా యువగళం ముందుకు నడుస్తూనే ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. సొంత నియోజకవర్గంలో పర్యటించే సమయంలోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయ రౌడీయిజం ఎంతో కాలం సాగదని, రౌడీయిజాన్ని భూస్థాపితం చేసి తీరుతామని అన్నారు.