తెలుగు జాతికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తా!
తన పుట్టినరోజు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. చంద్రబాబు వెంట ఎంపీలు కేశినేని నాని, కనకమేడల ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న కూడా ఉన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబుకు వైదిక కమిటీ సభ్యులు వేద ఆశీర్వచనం అందించారు. దర్శనానంతరం అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం, చిత్రపటాన్ని ఆలయ ఈవో డి.భ్రమరాంబ అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని అన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు నాకు శక్తి సామర్ధ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నానని ఆయన అన్నారు. ప్రజల ఇబ్బందులు తొలగించాలని వేడుకున్నానని, తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. తప్పకుండా జయం సాధిస్తామని నమ్మకం ఉందని, రాజీలేని పోరాటం తో ప్రజలకు అండగా నిలబడతాను అని అన్నారు. అభిమానులకున్న అంచనాల ప్రకారమే ముందుకెళ్తామని అన్నారు.