Chandrababu: పెద్దిరెడ్డి, నీ అంతు చూసే వరకు నిద్రపోను!
Chandrababu Comments at Jail: అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలు వద్ద తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో పోలీసులు టెర్రరిస్టులలా ప్రవర్తిస్తున్నారని, మైనారిటీలపై కక్ష కట్టి కేసులు పెట్టారని అన్నారు. చదువుకునే విద్యార్థుల పై హత్యాయత్నం కేసు నమోదు చేశారని, అరెస్ట్ చేసిన తర్వాత దారుణంగా హింసించి, ట్యూబులతో కాళ్లపై కొట్టారని అన్నారు. పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్న ఆయన దీనికంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇంకొకటి ఉండదని అన్నారు. పోలీసులు కొట్టిన విషయం మేజిస్ట్రేట్ ముందు చెప్తే చంపేస్తామని బెదిరించారని, గన్ తో కాల్చేస్తామని బెదిరించారని అన్నారు. పోలీసుల్ని వదిలిపెట్టేది లేదు, న్యాయ పరంగా పోరాటం చేస్తామని ఈ సంధర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ బ్యానర్లు ఎందుకు చింపారు అని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, కల్లూరు సీఐ, రొంపిచర్ల ఎస్ ఐ చాలా దారుణంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. పోలీసులు ఎంపీ రఘురామ కృష్ణంరాజుని కొట్టినట్టు మా కార్యకర్తల్ని కొట్టారని, నేను ఎక్కడికి వస్తే అక్కడ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని అన్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం పోలీసుల వేధింపుల వల్ల చనిపోయారని, అలాగే పండగ రోజు మా కార్యకర్తల్ని జైల్లో పెట్టారని అన్నారు. పెద్దిరెడ్డి నీ అంతు చూసే వరకు నిద్రపోను అంటూ వార్ణింగ్ ఇచ్చిన చంద్రబాబు కోడి పందాలకు అనుమతి ఎలా ఇచ్చారు? కోడి కత్తి గుచ్చుకొని చనిపోయిన వారి గురించి ఏమి సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి పని అయిపోయింది, అ పార్టీ మూసుకొని వెళ్లే సమయం వచ్చిందని చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇక ఇది స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అని ఆయన ఆరోపించారు.