Chandra Babu: రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, ఊరికో సైకో ఉన్నాడు- చంద్రబాబు
Chandra babu Naidu Sankratnhi wishes for all Telugu People
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారావారి పల్లెలో పండుగ జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఈ పండుగ కలిసిరావాలని ఆకాంక్షించారు. తాను ఇక్కడే పుట్టి అంచెలంచెలుగా ఎదిగానని గుర్తుచేసుకున్నారు. తెలుగు జాతికి నాయకత్వం వహించే అదృష్టం రావడం భగవంతుని దయ అని చంద్రబాబు అన్నారు.
పండుగ సందర్భంగా కూడా ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు పలు ఘాటు విమర్శలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి జిల్లాకు భారం అయ్యాడని, అతడి హత్యా రాజకీయాలు నాడు నేను చూసీ చూడనట్లు వెళ్లడం వల్ల ఇలా అయ్యాడని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 1 పై విమర్శలు గుప్పించిన చంద్రబాబు జీవో కాపీలను భోగీ మంటల్లో వేసి తగులబెట్టారు.
ఏపీలో ప్రతి ఇంటిలో కష్టాలు ఉన్నాయని, వీటిని భోగిలో తగులబెట్టి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు. తెలుగుదేశం పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ప్రజా వేదిక విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభం అయ్యిందని… బాదుడే బాదుడే వరకు వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు బతుకు మీద ఆశలు వదులుకుంటున్నారని, ఆత్మహత్యలకు కారణమవుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఆర్టీసీలో టిక్కెట్ ధరలు పెంచారని, పోలవరం మునిగిందని, పరిశ్రమలు పారిపోతున్నాయని, అమ్మవడి వల్ల లాభం లేదని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా తయారయిందని, వూరికొక సైకో ఉన్నాడని చంద్రబాబు మండిపడ్డారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పు కూడా చేయలేదని చంద్రబాబు అన్నారు. కొందరు చేసిన కుట్ర కారణంగానే కందుకూరులో తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. గుంటూరులోనూ అలానే చేశారని చంద్రబాబు మండిపడ్డారు. తాను కుప్పం వచ్చే లోపే జీవో నెంబర్ 1 విడుదల చేశారని బాబు గుర్తుచేశారు.
వీధివీధినా భోగిమంటలతో సందడి చేస్తున్న తెలుగు వారందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇంటింటా పేరుకున్న కష్టాలు భోగిమంటల్లో దగ్ధమై, ప్రతి లోగిలీ కొత్త వెలుగులు నింపుకుని మన జీవితాల్లో సరికొత్త క్రాంతికి స్వాగతం పలకాలని ఆకాంక్షిస్తున్నాను#Bhogi
— N Chandrababu Naidu (@ncbn) January 14, 2023