TTD: టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియామకం
Chaganti Kotewswar Rao appointed as advisor to TTD
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీ కీలక బాధ్యతలు అప్పగించింది. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించింది. చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్‌డీపీపీ) కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడేళ్లుగా వివిధ పారాయణాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ నియామకం చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం గత మూడేళ్లుగా చేపడుతున్న పారాయణాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఏపీలోని మారుమూల గ్రామాల్లోకి హిందూ ధర్మ ప్రచారాన్ని తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామీణ యువతను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో హోమాలు, యాగాలు, ఇతరత్రా భక్తి కార్యక్రమాలును విస్తృతంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేశస్థానం భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది.
చాగంటి కోటేశ్వర రావు తన ప్రవచనాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా ఎందరో తెలుగు ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. తన ఆధ్యాత్మిక ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం నింపేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. చాగంటి ప్రసంగాలను ప్రతి రోజూ లక్షలాది వీక్షిస్తున్నారు. సాంత్వన పొందుతున్నారు.