కేంద్రం నిధులు పక్కదారి పడుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎంపీ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల ఉపాధి కోసం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్నారు. అలంకారప్రాయమైన పదవులను బీసీలకు ఇచ్చారన్నారు.
పేరుకే రాష్ట్ర హోం మంత్రిగా వనితను నియమించారన్న జీవీఎల్.. అధికారాలు మాత్రం తనకు ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కొన్ని కులాలకు పదవులు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏపీలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు అధికంగా ఉన్నాయన్నారు. పెట్రోల్, డీజిల్‌పై ఏపీ ప్రభుత్వం వ్యాట్ విధించడంతోనే రాష్ట్రంలో ధరలు మండిపోతున్నాయన్నారు. జగన్‌మోహన్ రెడ్డి నియంతృత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారన్న జీవీఎల్.. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.