శాప్ ఈవెంట్ లో బైరెడ్డి గాయబ్.. పేరు కూడా లేకుండా?
ఏపీలో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అసలు విషయం ఏమిటంటే బుధవారం నాడు విజయవాడ మున్సిపల్ క్రీడా మైదానంలో వేసవి శిక్షణ శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆ సంస్థ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గైర్హాజరయ్యారు. గైర్హాజరు కావడం పెద్ద విషయం కాదు కానీ కార్యక్రమానికి హాజరైన అధికారులు, వైసీపీ ప్రజా ప్రతినిధులు కానీ ఎక్కడా బైరెడ్డి పేరు ఎత్తకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ప్రోటోకాల్ ప్రకారం ఆయన పేరును అధికారులు ప్రస్తావించాలి, కానీ అలా ప్రస్తావించకపోవడం కారణంగా కొత్త చర్చ మొదలైంది. బైరెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారానికి ఈ ఘటన మరింత బలపడి నట్లయింది. ఉద్దేశపూర్వకంగా బైరెడ్డి పేరు చెప్పలేదా లేక మరిచిపోయారా? అనే చర్చ కొనసాగుతోంది. నిజానికి నారా లోకేష్ తో సిద్దార్థ రెడ్డి భేటీ అయ్యారని ఆయన పార్టీ మారుతున్నారు అని ప్రచారం మొదలైంది. కానీ ఆయన దాన్ని ఖండించారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన హాజరు కాకపోవడం మళ్ళీ అదే చర్చకు దారి తీసింది.