Bye Election: ఆత్మకూరులో ముగిసిన ప్రచారం
Bye Election Campaign Ended: నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు ప్రచార గడువు ఇవాళ సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. దీంతో బయటి వ్యక్తులు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. ఈ ఎన్నికలో విజయం కోసం అధికార పార్టీ వైఎస్సార్సీపీ తరఫున 9 మంది మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు.
బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన అంటే ఎల్లుండి అక్కడ పోలింగ్ జరగనుంది. తెల్లారే కౌంటింగ్ నిర్వహిస్తారు. దీనికోసం ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్షన్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటుచేశారు. కౌంటింగ్ కూడా అక్కడే చేపడతారు. పోలింగ్ ప్రశాంతగా జరిగేందుకు మూడు కంపెనీల కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఈ ఉపఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ తరఫున ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో నిలిచారు. ఆయన మినహా మరో 13 మంది పోటీలో ఉన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉంది. బీజేపీ తరఫున భరత్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రచారం ముగియటంతో వివిధ పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.