Bulk Drug Park: ఏపీ బల్క్ డ్రగ్ పార్క్ కు 1000 కోట్లు!
Bulk Drug Park: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్క్‌లో ఉమ్మడి మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్‌లో మౌలిక వసతుల కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రాజ్యసభలో మంగళవారం వైసీపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలో బల్క్ డ్రగ్ పార్క్‌లను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ఫార్మాసూటికల్స్ విభాగం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా దేశీయ వినియోగంతో పాటు, ఎగుమతులకు అవసరమైన మందుల తయారీకి అనువైన వాతావరణ పరిస్థితుల కల్పనే ఈ పథకం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం మార్గదర్శకాలను అనుసరించి బల్క్ డ్రగ్ పార్క్‌లో ఏర్పాటయ్యే ఫార్మా పరిశ్రమలకు ఫార్వార్డ్, బాక్‌వార్డ్ లింకేజీతో మద్దతుతో కనెక్టివిటీని కల్పించే అవకాశాల ప్రాతిపదికపై వాటిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు.