100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధం.. బుద్దా వెంకన్న సంచలనం
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గురించి చెత్త వాగుడు వాగిన వారిని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందని, ఎవరైనా అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా, చావడానికైనా ఆ సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందని తెలిపారు. వచ్చే రెండేళ్ల పాటు చంద్రబాబు కుటుంబంపై పిచ్చి వేషాలు చేసే వైసీపీ బ్యాచ్ నోరు అదుపులో పెట్టుకోవాలని బుద్ధా వెంకన్న హితవు పలికారు. చంద్రబాబును తిడితే, టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే పదవులు వస్తాయని వైసీపీ నేతలు కలలు కంటున్నారని, ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రతి మనిషిలో కృతజ్ఞత అనేది ఉండాలని.. పార్టీలో తనకు, నాగుల్ మీరాకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని బుద్ధా వెంకన్న తెలిపారు. అందుకే చంద్రబాబు కటౌట్‌కు పంచామృతాలతో పాలాభిషేకం చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అలాగే బాబు జన్మదినం సందర్భంగా 500 మందికి చీరలు పంపిణీ చేశామన్నారు.