BRS In AP: బీఆర్ ఎస్ రెండో సభ విశాఖలో..!
BRS second meeting likely to be conduct in Vizag: జాతీయ పార్టీగా రూపాంతరం చెంది.. ఖమ్మంలో అనధికారికంగా ఆవిర్భావ బహిరంగ సభ జరుపుకొన్న భారత రాష్ట్ర సమితి.. తన రెండో సభకు వేదికగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నాన్ని ఎంచుకుంది. త్వరలోనే విశాఖలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించారు. దీంతో ఖమ్మం తరువాత అందరి ఫోకస్ విశాఖపై పడనుంది. ప్రధానంగా కేసీఆర్ ఆంధ్రలో అడుగు పెడుతుండడాన్ని అక్కడివారిలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కారణమై.. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని, ఎటువంటి అభివ్రుద్ధికి నోచుకోకుండా.. పరిశ్రమలన్నీ హైదరాబాద్‌కు తరలిపోతున్నాయనే అభిప్రాయం వారిలో ఉంది.
పైగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర నేతలు, ఆంధ్ర ప్రజలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేసుకుంటున్నారు. అయినా.. కేసీఆర్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. ఏపీలో పార్టీ శాఖను ఏర్పాటు చేయడంతోపాటు అధ్యక్షుడినికూడా నియమించారు. రేపో మాపో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తాము పాటుపడతామని ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని కూడా అంటున్నారు. ఈ క్రమంలో విశాఖలోనే సభ నిర్వహించనుండడం పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన అమరావతి రాజధానిని వైఎస్ జగన్ సర్కారు వ్యతిరేకించి మూడు రాజధానుల సూత్రాన్ని తెరపైకి తేవడం, అందులో విశాఖపట్నం ఒకటి అని ప్రకటించడంతో ఈ విషయంలో కేసీఆర్ ఎటువంటి స్టాండ్ తీసుకుంటారన్నది కీలకం కానుంది.
ఇక ఈ సభలోనే పలువురు ఏపీ నేతలు బీఆర్ ఎస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో గులాబీ కండువా కప్పుకొనేవారు ఎవరెవరనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే కేసీఆర్ ప్రధానంగా కాపు, వెలమ సామాజికవర్గ నేతలపైనే ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తోట చంద్రశేఖర్‌ను అధ్యక్షుడిగా నియమించడంతోపాటు అదే సామాజికవర్గానికి చెందిన శాంతికుమారిని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా కాపులకు తాను ఎంత ప్రాధాన్యం ఇస్తున్నది చెప్పకనే చెప్పారు. ఇక ఉత్తరాంధ్రలో వెలమ (కొప్పుల వెలమ) సామాజివర్గానికి చెందినవారు రాజకీయంగా బలంగా ఉండడంతో.. అదే సామాజివర్గానికి చెందిన నేతగా వారిని ఆకర్షించే ప్రయత్నాలు కేసీఆర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వెలమలు ఇటు అధికార వైసీపీతోపాటు అటు టీడీపీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలను కాదని, కారు ఎక్కేందుకు ఎంతమంది సిద్ధపడతారో చూడాల్సి ఉంది.