KCR Plans : కేసీఆర్ తో టచ్ లో ఉన్న ఆ ఏపీ ఎమ్మెల్యేలెవరు..?
KCR Claimed some sitting AP MLAs are also willing to join the BRS: బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఏపీ రాజకీయాలపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. సిట్టింగ్ లు సైతం తమతో టచ్ లో ఉన్నారంటూ ఆసక్తికర చర్చకు తెర తీసారు. తోట చంద్రశేఖర్ ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారు. రావెల కిషోర్ బాబును జాతీయ రాజకీయాల్లో తనతో కలిసి పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. సంక్రాంతి తరువాత బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ఏపీలో ప్రజా రాజకీయం రావాలని వ్యాఖ్యానించారు. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ ఏపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. జగన్..కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. కానీ, ఇద్దరి మధ్య ఆ సంబంధాల్లో గ్యాప్ కనిపిస్తోంది.
సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటును తాను వ్యతరేకించానని, పొరుగు రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదనేది జగన్ విధానంగా ముఖ్యమంత్రి తరపున సజ్జల స్పష్టం చేసారు. తెలంగాణలో షర్మిల తన రాజకీయంలో భాగంగా సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ ఏర్పాటు..విస్తరణలో భాగంగా ఏపీలోనూ పార్టీ కార్యక్రమాలు ప్రారంభించారు. టీడీపీ, బీజేపీ, జనసేనలో పని చేసిన నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో ఏపీలో ఊహించని వ్యక్తులు బీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇస్తారంటూ ఆసక్తి పెంచారు. సిట్టింగ్ లు తనతో టచ్ లో ఉన్నారని చెప్పారు. టీడీపీకి అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నలుగురు వైసీపీ అనుబంధ సభ్యులుగా మారిపోయారు. మిగిలిన 18 మందికి తిరిగి సీట్లు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అటు అధికార వైసీపీకి 151 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఎవరైనా కొనసాగలేని పరిస్థితులు ఉన్నా.. ఎన్నికల వరకు పార్టీ మార్పు నిర్ణయానికి అవకాశం లేదు.
అధికార పార్టీ నుంచి వెళ్లే సాహసం ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయాల్లో ఎవరూ చేసే ఛాన్స్ లేదు. ఎవరైనా ఉన్నా.. స్థానికంగా వైసీపీకి ధీటుగా నిలిచే పార్టీల వైపే చూసే అవకాశం ఉంటుంది. ఇదంగా కేసీఆర్ రాజకీయంగా ఆడుతున్న మైండ్ గేమ్ గా విశ్లేషణలు మొదలయ్యాయి. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నా.. ముందుగా ఏపీ విషయంలో బీఆర్ఎస్ విధానం.. వైఖరి, అజెండా స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఏపీకి సానుకూలంగా మాట్లాడిన వెంటనే తెలంగాణలో ఇక చంద్రబాబు, పవన్ అడుగు పెట్టినా.. ఆంధ్రానేతలు అని అడ్డుకొనే అవకాశం ఇక కేసీఆర్ కోల్పోతారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ అధికార వైసీపీకి అనుకూలమనే ప్రచారం మొదలైన వేళ..వైసీపీ నేతలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కామెంట్స్ మొదలు పెట్టారు. టీడీపీ – జనసేన ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ పైన స్పందించలేదు. విశాఖ స్టీల్ మోదీ ప్రభుత్వం ప్రయివేటీకరించినా..బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తిరిగి జాతీయకరణ చేస్తామని హామీ ఇచ్చారు.
ఏపీకి ఇప్పుడు కీలకమైన పోలవరం విషయంలో ఏ రకంగా సహకరించేదీ కేసీఆర్ ప్రస్తావించలేదు. మూడు రాజధానుల అంశంలో నేరుగా కేసీఆర్ కాకపోయినా, బీఆర్ఎస్ పార్టీ నేతలుగా ఇప్పుడు చేరిన ఏపీ నాయకులు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీలో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ ప్రతీ పార్టీకి కీలకంగా మారుతోంది. బీఆర్ఎస్ ఎంపిక చేసుకున్న నేతలు, క్షేత్ర స్థాయిలో వారు చేస్తున్న మంత్రాంగం చూస్తూంటే జనసేనకు మద్దతుగా నిలుస్తున్న వారిలో చీలక తెచ్చే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. జనసేనలో కీలక స్థానంలో పని చేసిన తోట చంద్రశేఖర్ కు సహజంగానే ఆ పార్టీ మద్దతు దారులతో మంచి సంబంధాలు ఉంటాయి. కానీ ఓట్ల పరంగా బీఆర్ఎస్ ఎంత మేర, ఎవరి ఓట్లను చీల్చుతుందనేది కీలక అంశం. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఏపీ కేంద్రంగా వేసే అడుగులు, తీసుకొనే నిర్ణయాల ఆధారంగా ఈ లెక్కల పైన ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది.