నాటు సారా తయారీ ఒక కులం హక్కు.. బొత్స కీలక వ్యాఖ్యలు
వైఎస్ జగన్ రాజీనామా చేయాలి అంటూ చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగానికి లోబడి చట్టాలు ఉండాలని, ఏ వ్యవస్థ అయినా వారి పరిధిలోనే పనిచేయాలని ఆయన అన్నారు. హై కోర్టు తీర్పుపై చంద్రబాబు సభలో మాట్లాడాల్సింది అని హితవు పలికారు. వాళ్ల శాసనసభ్యులు రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరమని చెప్పండి అని అన్నారు. వాళ్లకు ఉత్సాహంగా ఉంటే రాజీనామాలు చేయమని చెప్పండి అని వ్యాఖ్యానించారు. 7300 ఎకరాలు మిగిలింది.అమ్మితే లక్ష కోట్లు వస్తుందా..? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఆక్రోశంతో,కడుపు మంటతో మాట్లాడుతున్నారని, సహజ మరణాలను కల్తీ మరణాలుగా చూపించాలని ప్రయత్నం చేశారని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో సారా తయారీ ఒక కులం హక్కు అని అయినా ఎక్కడైనా సారా తయారీ ఉంటే చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. ఎన్టీఆర్ కౌన్సిల్ రద్దు చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.