Chiranjeevi Politics: ‘చిరు’ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీ!
Chiranjeevi Politics: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ రంగ ప్రవేశం చేసిన మెగాస్టార్ ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తానికి పెద్దగా వ్యవహరించే స్థాయికి వచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు సినీ పరిశ్రమ మొత్తాన్ని శాసించే స్థాయిలో ఇప్పుడు ఆయన ఉన్నారు. అయితే ఎన్టీ రామారావు తరహాలోనే తాను కూడా రాజకీయాల్లో చక్రం తిప్పాలని 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 సీట్ల నుంచి పోటీ చేసి కేవలం 18 సీట్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత వైఎస్ మరణం, వైయస్ జగన్ కొత్త పార్టీ ప్రకటన తర్వాత చిరంజీవి తన పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసి తాను హ్యాపీగా కేంద్ర మంత్రి అయిపోయి తన ఎమ్మెల్యేల్లో కొందరిని మంత్రులను కూడా చేసుకున్నారు.
కేంద్ర మంత్రిగా కొన్నాళ్లపాటు బాధ్యతలు కూడా నిర్వర్తించిన ఆయన రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక రాజకీయాలు మనకు అచ్చిరావు అని సైలెంట్ అయిపోయారు. పూర్తిగా రాజకీయాలనుంచి వైదొలిగిన ఆయన మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టి సినిమాల్లో పూర్తిస్థాయిలో కాన్సెంట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే రీఎంట్రీ తర్వాత దాదాపు నాలుగు సినిమాలు చేసిన చిరంజీవి ఇప్పుడు దాదాపు మూడు నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. వరుసగా సినిమాలు చేస్తూ పూర్తిగా పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నట్లు ఆయన చెప్పుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన మా వాడే అని చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది. ఆయన కాంగ్రెస్ సభ్యత్వాన్ని వదులుకోక పోవడంతో ఇంకా మా సభ్యుడే అని కాంగ్రెస్ చెబుతోంది. ఆ మధ్య జరిగిన కాంగ్రెస్ సర్వసభ్య సమావేశాలకు సైతం చిరంజీవికి ఆహ్వానం పంపింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అయితే చిరుని తిరిగి పాలిటిక్స్ లోకి తీసుకురావాలని,యాక్టివ్ చేయాలనీ బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఎలాంటి బలం లేక ఇబ్బందులు పడుతున్న కమలం పార్టీ చిరంజీవి గనక తమ పార్టీలోకి వచ్చి పూర్తిస్థాయిలో రాజకీయం చేస్తే తమ పార్టీకి భవిష్యత్తు ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గత ఏడాది ఫిలిం ఫెస్టివల్ లో భారత ప్రభుత్వం ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వడం, భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో ప్రధాని మోడీ చిరంజీవితో రాసుకుపూసుకు తిరగడం, తర్వాత అనురాగ్ ఠాకూర్ ఏకంగా చిరంజీవి ఇంటికి వెళ్లడం వంటి పరిణామాలు అన్ని గమనిస్తే బిజెపి చిరంజీవిని దువ్వెందుకు ప్రయత్నిస్తుందని ప్రచారం జరుగుతోంది.
అయితే చిరంజీవి మాత్రం బీజేపీ ఆహ్వానాన్ని అర్థం చేసుకుని ఆయన దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే ఆయన తమ్ముడు స్వయంగా ఏపీలో జనసేన పార్టీ పెట్టి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ రాజకీయాల మీద ఆసక్తి ఉన్నా తమ్ముడి పార్టీలో చేరుతారు కానీ తమ్ముడు మిత్రపక్షమైన బిజెపిలో ఎందుకు చేరేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ విషయం కూడా అర్థం చేసుకోకుండా బిజెపి ఎందుకు ఆయన కోసం ఇంత తాపత్రయపడుతోందని చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు ఏం చేయడానికైనా వెనుకాడని బిజెపి చిరంజీవిని పార్టీలోకి తీసుకోవాలని ప్రయత్నాల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది చూడాలి.