Anam : ఆనం వెంట పడుతున్న పార్టీ ఏదమ్మా?
Anam Rama Narayana Reddy: వైసీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యేలలో ఆనం రామనారాయణరెడ్డి కూడా ఒకరు. గతంలో కాంగ్రెస్లో పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆయన వెంకటగిరి టికెట్ దగ్గించుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో మరో సారి ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ జిల్లాలో ఇతర నేతలకు పదవి లభించడంతో ఎప్పటి నుంచో ఆయన తన ఆవేదనను అసంతృప్తిని అనేక విధాలుగా బయట పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలోనే ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయి.
అయితే ఆనం నారాయణరెడ్డిని ఎలాగైనా పార్టీలో చేర్చుకునేందుకు ఏపీ బీజేపీ గట్టి పట్టుదలగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి జనసేనతో బీజేపీ జట్టు కట్టింది కానీ రాబోయే రోజుల్లో ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి బిజెపిలో ఉన్న నేతలు ఎవరూ ముందు నుంచి బిజెపిలో ఉన్న వారు కాదు, కాలక్రమాన తమ మనుగడ కోసం వచ్చి షెల్టర్ తీసుకుంటున్న వారు ఎక్కువగా ఉన్నారు. దీంతో జిల్లాకు ఒకరిద్దరు సీనియర్ నేతలను జాయిన్ చేసుకుని బిజెపి కూడా బలపడిందని చెప్పుకోవడానికి బిజెపి నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉండగా తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశం లేదని ఒకప్పుడు అనుకున్నారు కానీ ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయశక్తిగా బిజెపి ఎదిగింది.
అదేవిధంగా ఏపీలో కూడా ఎదగాలంటే బలమైన నేతలు కావాలని భావిస్తున్న ఏపీ బీజేపీ ఆనం రామనారాయణ రెడ్డి వెనుక పడుతోందని ప్రచారం జరుగుతోంది. ఆయనే కాదు టిడిపి, వైసిపిలో ఉన్న అసంతృప్త నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి పావులు కదుపుతోందని అందుకే ఇటీవల వైసీపీ ఆగ్రహానికి గురై వైసీపీ మీద అక్రిసం వెళ్ళగకుతున్న ఆనం రామనారాయణ రెడ్డిని తమ వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు బిజెపి నేతలు ఆనం రామనారాయణ రెడ్డికి టచ్ లోకి వెళ్ళారని ఆయనకు నెల్లూరు జిల్లా బాధ్యతలు అన్నీ అప్పగించడంతో పాటు రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యం ఇస్తామని బిజెపి నేతలు ఆఫర్ చేశారని చెబుతున్నారు.
అంతేకాక ఆనం గురించి జాతీయస్థాయి నాయకులు కూడా ఆరా తీస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ ఆయనను కనుక పార్టీలోకి తీసుకుంటే నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో బిజెపి గతంలో కంటే బలపడే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎలా అయినా బిజెపిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేయాలని రాష్ట్రస్థాయి నేతలకు జాతీయ నేతలు నుంచి సందేశాలు అందినట్లుగా చెబుతున్నారు. అయితే బీజేపీ మీద ప్రస్తుతం ఏపీ ప్రజల్లో ఎలాంటి నమ్మకం లేదు కాబట్టి ఆనం రామనారాయణరెడ్డి బిజెపి వంక చూస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.