AP Politics: ఏపీలో పొత్తులాట క్లియర్..మేలు జరిగేదెవరికి..!
BJP Leaders says no Alliance with TDP in Telugu States politics: ఏపీలో పొత్తు రాజకీయం పైన దాదాపు స్పష్టత వస్తోంది. టీడీపీ ..జనసేన పొత్తు వేళ బీజేపీ తమ నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లో 2014 ఎన్నికల మాదిరి టీడీపీ..బీజేపీ..జనసేన కలిసి వెళ్లాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆలోచన. ఇందుకు పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచారు. ఆ క్రమంలో టీడీపీ..జనసేన దాదాపు పొత్తుకు సిద్దం అయ్యాయి. బీజేపీ స్టాండ్ ఏంటనేది ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగింది. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ తాము తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో కలవకూడదని నిర్ణయించింది. ఏపీలో పవన్ తమతో ఉన్నా, లేకున్నా టీడీపీతో కలవకూడదనేది పార్టీ నిర్ణయంగా ఉంది. తమతో బీజేపీ కూడా కలిసి రావాలని పవన్ ప్రతిపాదించారు. అందుకు బీజేపీ సిద్దంగా లేదు. ఇప్పుడు పవన్ టీడీపీతో ముందుకెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీది ఒంటరి పోరు తప్పేలా లేదు.
ఇక బీజేపీతో పొత్తు లేకపోతే సీపీఐ కూడా టీడీపీ..జనసేనతో చేతులు కలిపే అవకాశం కనిపిస్తోంది. సీపీఎం మాత్రం టీడీపీకి దూరంగా, వైసీపీకి దగ్గరగా వ్యవహరిస్తోంది. తెలంగాణ బీఆర్ఎస్ పై గురి పెట్టిన బీజేపీకి తాము అక్కడ సహకరించి, ఏపీలో తాము బీజేపీ సహకారం పొందాలనేది టీడీపీ వ్యూహం. అందుకు బీజేపీ సిద్దంగా లేదనే విషయం స్పష్టం అవుతోంది. తెలంగాణలో టీడీపీతో పొత్తును రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇష్టపడటం లేదు. ఇదే విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వానికి నివేదించారు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుంటున్న బీజేపీ నాయకత్వం ఇప్పటికిప్పుడు ప్రయోజనం కంటే, భవిష్యత్ కీలకమనే అభిప్రాయానికి వచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి సహకరించకూడదని నిర్ణయించింది. టీడీపీకి అధికారం దక్కకుంటే ఉంటే, ఆ పార్టీ క్రమేణా బలహీనపడుతుందనేది బీజేపీ నేతల అంచనా. ఏపీలో తాము ఎదగాలంటే టీడీపీ బలహీనపడితేనే సాధ్యమని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు.
వైసీపీ ఓట్ బ్యాంక్ పూర్తిగా బీజేపీకి వ్యతిరేకం కావటంతో టీడీపీ బలహీనపడాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ ఓట్ బ్యాంక్ దాదాపు ఒకటే కావటం ఇందుకు ప్రధాన కారణం. కానీ, నాలుగు దశాబ్దాలుగా గ్రామ గ్రామన విస్తరించిన టీడీపీ ఇప్పుడు బీజేపీ కోరుకుంటన్న విధంగా బలహీన పడి, బీజేపీకి బలపడే అవకాశం ఇస్తుందా అనేది సందేహమే. బీజేపీని ముందుకు నడిపించే బలమైన నేతలు ఆ పార్టీకి ఏపీలో కనిపించటం లేదు. తెలంగాణలో బండి సంజయ్ నియామకం తరువాత పార్టీలో జోష్ పెరిగింది. ఏపీలో రాష్ట్ర నాయకత్వం ఒక సమస్య అయితే, వైసీపీ తో కేంద్ర నాయకత్వానికి ఉన్న సంబంధాలు మరో కారణం. ఏపీలో బీజేపీకి బలం లేకపోయినా, టీడీపీ.. జనసేన ఆ పార్టీతో జత కట్టాలని కోరుకోవటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి.
2019 ఎన్నికల్లో టీడీపీ తమతో విభేదించటంతో..బీజేపీ కేంద్ర నాయకత్వం పరోక్షంగా జగన్ కు మద్దతుగా నిలిచింది. ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో ఆ మద్దతు కీలకంగా మారుతుంది. ఇప్పుడు కూడా బీజేపీ అదే విధంగా జగన్ కు సహకారం అందించకుండా, తమతో కలిసేలా చంద్రబాబు…పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల నేతలు మాత్రం టీడీపీతో పొత్తుకు నో అని చెబుతున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు బీజేపీ కేంద్ర నాయకత్వం దాదాపు పొత్తులు వద్దనే నిర్ణయానికి వచ్చింది. ఎన్నికలకు తెలంగాణలో ఇంకా 9 నెలల సమయం ఉంది. ఈ లోగా అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుంటే మినహా 2014 పొత్తులు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి ఏర్పడే అవకాశం కనిపించటం లేదు.