Janasena: పొత్తు లేదని ఎవరు చెప్పారంటున్న జనసేన.. ఆ ఊసే ఎత్తని బీజేపీ!
Janasena- BJP alliance: 2024 ఎన్నికలలో ఏ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి? ఏ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తాయని విషయమే ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రస్తుతానికి జనసేన బీజేపీ కలిసి నడుస్తూ ఉంటే జనసేన టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీలో బీజేపీతో పొత్తు ఉందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2014 కాంబినేషన్ పునరావృతంపై కాలమే సమాధానం చెబుతుందని కొండగట్టులో అన్నారు.
ఎన్నికలు వారంలో ఉంటే పొత్తులపై లోతుగా మాట్లాడవచ్చని పేర్కొన్నారు. ‘ఎవరు వచ్చినా రాకున్నా ముందుకెళ్తాం. ఎవరూ రాకుంటే ఒంటరిగా వెళ్తాం’ అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు సర్కార్ GO నెం.1 తీసుకొచ్చిందని విమర్శించారు. జనసేన తెలంగాణలో పనిచేస్తుందని, ప్రజల కోసం పోరాడతామని అన్నారు. తెలంగాణలో ఎంత అనేది కాలం నిర్ణయిస్తుందని అయితే తెలంగాణలో పరిమితంగా ఉంటానని అన్నారు.
ఇక ఎక్కువ ఊహించుకోనని పేర్కొన్నారు. అయితే బీజేపీతో పొత్తు కొనసాగుతుందని జనసేనాని పవన్ కళ్యాణ్ అంటుంటే.. BJP రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం పార్టీ కార్యవర్గ సమావేశాల్లో జనసేన పేరెత్తడం లేదని అంటున్నారు. రాజకీయ తీర్మానంలోనూ ఆ పార్టీ పేరును ప్రస్తావించలేదని అంటున్నారు. అయితే వైసీపీ, టీడీపీల అవినీతి, వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ టీడీపీకి దగ్గరవుతున్నారనే.. బీజేపీ ఆయనను దూరం పెడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.