బలభద్రపురంలో బిర్లా గ్రూప్ పెట్టుబడి.. 2.473 కోట్లతో ప్రాజెక్ట్
తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. జిల్లాలో ఆదిత్య బిర్లా గ్రూప్ నిర్మిస్తున్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌ను సీఎం ప్రారంభించారు. అదిత్య బిర్లా గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. బలభద్రపురంలో బిర్లా గ్రుప్ 2 వేల 473 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2 వేల 450 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. 131 మంది ఉద్యమకారుపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. గతంలో బలభద్రపురంలో కాలుష్య పరిశ్రమ వద్దంటూ KPRకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినట్లు జగన్ తెలిపారు. 321వ జీవో ద్వారా ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. కేసుల ఎత్తివేత కాపీని సీఎం స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి అందజేశారు.
మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడులకు అన్ని విధాలుగా అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. రానున్న రోజుల్లో 2 వేల 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమకు సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం జగన్‌కు బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా కృతజ్ఞతలు తెలిపారు.