భాకరాపేట ప్రమాద ఘటన : పరిహారం ప్రకటించిన జగన్
చంద్రగిరి సమీపంలో భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి కారణాలు, సహాయక చర్యలు గురించి ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని ముఖ్యమంత్రికి వెల్లడించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎంకు వివరించారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 55 మందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి పెళ్లి నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.