Bandi Sanjay: కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. తేల్చేసిన బండి సంజయ్!
e: ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశం సంతాప సభను తలపించిందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ముఖంలో భయం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ఆయన ఆ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ అయ్యిందని, తప్పు చేసినోళ్ల సంగతి తేలుస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది మరో 3, 4 నెలలేనని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది బీజేపీ యేనని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు ఫస్ట్ తేదీన జీతాలిస్తాం… నెల రోజుల్లో డీఏలు చెల్లిస్తాం, వెంటనే పీఆర్సీని నియమించి అమలు చేస్తామని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ బదిలీలు, ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించారు.
కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు టీచర్ల, ఉద్యోగుల సమస్యలు ఎందుకు ప్రస్తావించడం లేదని, టీఎన్జీవో నాయకుల చిట్టా తీస్తున్నామని, బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తామని హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోని సుదర్శన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ –రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ – అధ్యాపకులు ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ ఈమేరకు కామెంట్లు చేశారు. భారతమాతాకీ జై అంటే కూడా మతతత్వవాదులని ముద్రవేసే దుస్థితి తెలంగాణలో నెలకొందన్న ఆయన టీచర్ ఎన్నికలు ఈ ప్రాంతానికే పరిమితం కాదు… తెలంగాణ ప్రజల భవిష్యత్ ను నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రజలంతా మీరిచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.
కేసీఆర్ లో భయం మొదలైంది… బిస్తర్ సర్దుకుంటున్నడు. రాత్రింబవళ్లు తాగుతున్నాడు అని అన్నారు. టీఆర్ఎస్ గెలవడం సాధ్యం కాదని తెలిసే బీఆర్ఎస్ పేరుతో కొత్త దుకాణం తెరిచారని అన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారు? టీచర్ల, ఉద్యోగుల సమస్యలు ఎందుకు ప్రస్తావించరు? టీఏ, డీఏలు, బదిలీలు, ప్రమోషన్ల, 317 జీవోపైనా, రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్లపై ఎందుకు చర్చించలేదు? టీఎన్జీవో నాయకుల చిట్టా తీస్తున్నా… వచ్చేది బీజేపీ ప్రభుత్వమే… అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తానని హెచ్చరించారు.
దొంగ దందాలు చేసే కేసీఆర్ బిడ్డ దీక్ష చేస్తే ఏమనాలి? ఆమె ఎవరి కోసం దీక్ష చేసింది? దొంగ సారా దందా చేసినామే రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క దీక్ష చేస్తుందట అసలు దొంగ సారా దందాకు రూ.100 కోట్లు కేసీఆర్ బిడ్డకు ఎక్కడి నుండి వచ్చాయి? అని ప్రశ్నించారు. ఇక తెలంగాణ ఉద్యమానికి ముందు సొంత ఇల్లే లేదని చెప్పిన వాళ్లు ఈరోజు ఇంద్రభవనాల్లో ఎట్లా ఉంటున్నారు? అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఫైనాన్స్ పై కారు, ప్రచార రథం తీసుకున్న కేసీఆర్ కు వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? అని ప్రశ్నించిన ఆయన తెలంగాణ….తెలంగాణ అని ఓట్లు గుద్దితే… సర్వనాశనం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని అన్నారు. దొంగ సారా దందాతో వేల కోట్లు సంపాదించి దుబాయ్, మస్కట్ లో దాచి పెడుతున్నారని ఆయన అన్నారు.