Balineni Srinivas Reddy: ఏదో అయిందని హడావుడే.. అంతకు మించి ఏమీ లేదు!
Balineni Srinivas Reddy: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడంతో ఇప్పుడు అధికార వైసీపీ ఆత్మ రక్షణలో పడింది. ఈ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామని విషయం మీద కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తాము గత నాలుగేళ్లలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని ఆయన అన్నారు. వైసీపీ తరఫున మొదటిసారిగా టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్దానాల్లో పోటీ చేశామని, అందులో టీచర్స్ ఎమ్మెల్సీలు గెలిచాం.. గ్రాడ్యుయేట్స్ స్దానాల్లో ఓడామని అన్నారు. రెండు శాతం మాత్రమే ఓట్లు ఉన్న గ్రాడ్యుయేట్స్ లో గెలిచిన దానికి ఏదో జరిగిపోయిందని నానా హడావుడి చేస్తున్నారని, కానీ మేము టీచర్స్ ఎమ్మెల్సీలు గెలిచినా ఎటువంటి ఆర్బాటాలు చేయలేదని అన్నారు.
ఓటమిపై పార్టీ తరఫున పోస్ట్ మార్టం చేసుకుంటామన్న బాలినేని రెండు ఎమ్మెల్సీల్లో ఓడినంత మాత్రానా మా పార్టీ పని అయిపోయినట్లేనా? అని ప్రశ్నించారు. అలా అనుకుంటే గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు టీడీపీ దుకాణం ఎత్తివేయాలి కదా? అని బాలినేని ప్రశ్నించారు. ఎప్పుడు పరిస్థితి ఒకేలా ఉండదని తెలుసుకోవాలి లోకేష్ గారు, ఓటింగ్ లో పాల్గొన్న గ్రాడ్యుయేట్స్ లో సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు లేరు అని ఆయన అన్నారు. గ్రాడ్యుయేట్స్ లో ఎందుకు వ్యతిరేకత ఉందో తెలుసుకుని ముందుకు వెళ్తామని పేర్కొన్న బాలినేని అన్నీ వర్గాలను సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.