Ys Avinash Reddy: వివేకా హత్యకేసులో రేపు మరోసారి విచారణకు అవినాష్ రెడ్డి
Ys Avinash Reddy: దివంగత నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. పులివెందులలోని ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో పలుమార్లు వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసి ఆయనను విచారణకు పిలిచింది. హత్య కేసులోని కీలక పరిణామాలపై ఆయనను లోతుగా ప్రశ్నించింది. తాజాగా మరోసారి సోమవారం విచారణకు రావాలని తాజా నోటీసుల్లో పేర్కొన్నారు.
అవినాష్ రెడ్డికి ఇన్నిసార్లు సీబీఐ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐ స్పీడ్ పెంచింది. ఈ కేసులోని అనుమానితులందరికి నోటీసులు జారీ చేస్తోంది. ఇటీవల వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసి విచారించింది. భాస్కర్ రెడ్డిని పలుమార్లు సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో ఆయన హస్తం కూడా ఉన్నట్లు సీబీఐ అనుమానపడుతుంది.