మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు అతి త్వరలోనే అధికార వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు పదే పదే కథనాలను ప్రచురితం చేశాయి.
Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు అతి త్వరలోనే అధికార వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు పదే పదే కథనాలను ప్రచురితం చేశాయి. అవినాష్ నేడు అరెస్ట్.. రేపు అరెస్ట్ అంటూ సదరు మీడియా సంస్థలు చేసిన ప్రచారం అంతా కూడా ఉత్తిదే అంటూ వైకాపా శ్రేణులు పేర్కొన్నాయి. అయన అరెస్టు మరింత ఆలస్యం అవుతుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డికి ఇప్పటి వరకు సిబిఐ నుండి అరెస్ట్ కు సంబంధించిన సమాచారం లేదట. పలు దఫాలుగా విచారించిన సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఎవరికి వారు ఊహించుకుంటున్నారని.. ఆయనను అరెస్టు చేయకపోవచ్చు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు అరెస్టు కాకుండా అన్ని మార్గాలను అవినాష్ రెడ్డి అనుసరిస్తున్నారని కొందరు అభిప్రాయం పడుతున్నారు.
కొన్ని రోజుల క్రితం ఆయన తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంతో తనను కూడా అరెస్ట్ చేస్తారేమోననే ఆందోళనతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. కొద్దీ రోజుల క్రితం ముందస్తు బెయిల్ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు… ఇరువైపుల వాదనలు వినడంతో పాటు, గత నెల 25న విచారణ, తీర్పు చెబుతామని తెలిపి, అప్పటి వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆతరవాత అవినాశ్ రెడ్డి అరెస్టు అంశాన్ని తెలంగాణ హైకోర్టు పూర్తిగా సీబీఐకే వదిలేసింది. ‘మీ పని మీరు చేసుకోండి’ అని సిబిఐ కి చెప్పేసింది. నిజానికి… హైకోర్టు మధ్యంతర ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడే అవినాశ్ రెడ్డి అరెస్టుకు సాంకేతికంగా అడ్డంకులు తొలగిపోయాయి. కానీ… పిటిషన్ ఇంకా హైకోర్టులో విచారణలో ఉండగానే తదుపరి చర్యలకు దిగడం సరికాదు. ఇప్పుడు పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేస్తూ… సీబీఐ తన పని తాను చేసుకోవచ్చునని చెప్పకనే చెప్పింది. అవినాశ్ అరెస్టును అడ్డుకునేందుకు వైసీపీ పెద్దలు కోర్టులద్వారా ‘జాప్యం’ వ్యూహం అమలు చేస్తూనే… మరోవైపు లాబీయిస్టులనూ రంగంలోకి దించినట్లు వార్తలు వస్తున్నాయి. అవినాశ్ అరెస్టు విషయంలో కొన్ని నెలలుగా సీబీఐ ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి వేస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలున్నాయి. ఇప్పుడు… ఈ విషయంలో సీబీఐకి పూర్తి స్వేచ్ఛ లభించింది.
వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు సైతం పార్టీ కార్యకర్తలు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగి టీడీపీ, సీబీఐకి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో విధ్వంసం, హింసకు తావులేకుండా ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ కేసుపై ప్రజాదర్బార్ లో అవినాష్ రెడ్డి మాట్లాడారు. సునీత భర్త రాజశేఖరరెడ్డి ఫోన్ చేస్తేనే తాను అక్కడికి వెళ్ళానని పేర్కొన్నారు. ఫోన్ రావడం పదిహేను నిమిషాలు ఆలస్యమై ఉంటే ఈ రోజు తనపై నిందలు ఉండేవి కావన్నారు. తనను కేసులో ఇరికించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనకు, తన నాన్నకు, శంకర్ రెడ్డి అన్నకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వివేకా సార్ ను హత్య చేయబోమే ముందు దస్తగిరి వాళ్లు రాయించిన లేఖను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఆనాడే వాళ్లు చంపి డ్రైవర్ ప్రసాద్ ను ఇరికించాలని చూశారని పేర్కొన్నారు. ఈ రోజు అటువంటి కుట్రే తన మీద జరుగుతుందని వాపోయారు. తాను ఏ పాపం చేయలేదు కాబట్టి గత మూడు సంవత్సరాలుగా సీబీఐ విచారణ గురించి పట్టించుకోలేదని చెప్పారు. అదే ఇప్పుడు సిబిఐ ముందు అవినాష్ ఎందుకు చెప్పట్లేదని కొందరు ప్రశ్నించుకుంటున్నారు. అయితే సిబిఐ విచారణ ఇప్పటివరకు ఎనిమిది సార్లు వెళ్లాల్సి ఉండగా ఆరుసార్లు మాత్రమే హాజరయ్యారు.
ఇది ఇలాఉంటే నిన్న సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరిన సమయంలో తల్లికి అనారోగ్యం కారణంగా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాకుండా పులివెందుల బయలుదేరారు. తల్లికి అనారోగ్యం గురించి సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి లాయర్లు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం అనంతపురం జిల్లా తాడిపత్రిలో తల్లి వస్తున్న అంబులెన్స్ అవినాష్ రెడ్డికి ఎదురైంది. అక్కడే తల్లిని అవినాష్ రెడ్డి ఆమెను పరామర్శించి కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న సిబిఐ అధికారులు కర్నూల్ కి వెళ్లారు..ఈ నేపథ్యంలో ఈనెల 22 వతేది విచారణకి హాజరుకావాలని వాట్సాప్ సందేశాన్ని పంపారు. మరి ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి సిబిఐ విచారకు హాజరవుతారా లేదా అనేది చూడాలి..ఒకవేళ హాజరుకాకపోతే సిబిఐ అరెస్ట్ తప్పదని సమాచారం.