Atmakur bypoll: నేడే ఆత్మకూరు ఉప ఎన్నిక…
Atmakur bypoll:ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టిశ్రీరాములు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నేడు ఉప ఎన్నిక జరుగుతున్నది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఉప ఎన్నిక నిర్వహించే అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు ఎన్నికల సరళిని పరిశీలిస్తారు. ఇక ఈ ఉప ఎన్నికల బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి భరత్ కుమార్, బీఎస్పీ నుంచి ఓబులేసు బరిలో ఉన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యం అయింది.
గౌతమ్ రెడ్డి కుటుంబం నుంచి అభ్యర్థి బరిలో ఉండటంతో సంప్రదాయాన్ని గౌరవించి టీడీపీ పోటీకీ దూరంగా ఉండిపోయింది. మొత్తం 2 లక్షల 13 వేల 338 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు . 279 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 130 కేంద్రాల్ని సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇప్పటికే ఇటు వైసీపీ అటు బీజేపీ హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తామని వైసీపీ అంటుంటే.. తాము సైతం గట్టి పోటీ ఇస్తామని బీజేపీ అంటోంది.