TTD: నేడు ఆన్‌లైన్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం నేడు ఆన్‌లైన్ ద్వారా జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నది. ఈరోజు రేపు ఆర్జిత సేవకు సంబంధించిన టిక్కెట్లను జారీ చేయనున్నారు. కాగా, డిసెంబర్ 13 వ తేదీన ఈ నెల రెండో పక్షానికి సంబందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 16 వ తేదీ నుండి డిసెంబర్ 31 వ తేదీ వరకు టిక్కెట్లు విడుదల కానున్నాయి. డిసెంబర్ 16 వ తేదీ సాయంత్రం నుండి ధనుర్మాసం ప్రారంభం కానున్నది.
దీంతో డిసెంబర్ 17 వ తేదీ నుండి వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి సుప్రభాతానికి బదులుగా ధనుర్మాసంలో తిరుప్పావైతో స్వామివారిని మేల్కొపనున్నారు. ఇక ఇదిలా ఉంటే, తిరుమలలో రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్‌లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. నిన్న శ్రీవారిని 72,466 మంది భక్తులు దర్శించుకోగా, 28,123 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.29 కోట్లుగా ఉన్నది.