Balayya Fan marriage: బాలయ్య కోసం వీరాభిమాని ఎదురుచూపులు, ఎందుకో తెలుసా?
Ardent fan of Balayya waits for the actor’s presence at his wedding
ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం అనేది అత్యంత ప్రధానమైన ఘట్టం. అటువంటి ఘట్టాన్నిమరపురాని గుర్తుగా చేసుకోవాలని ఓ వ్యక్తి భావించాడు. నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని అయిన విశాఖలోని పెందుర్తికి చెందిన పెద్దినాయుడు బాలయ్య వస్తేనే పెళ్లి చేసుకుంటానని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
గత మూడేళ్లుగా పట్టువిడవకుండా ఎదురుచూస్తున్నాడు. 2019లో నిశ్చితార్ధం చేసుకున్న పెద్దినాయుడు అప్పటి నుంచి బాలయ్య వస్తేనే వివాహం చేసుకుంటానని తెగేసి చెబుతున్నాడు. తనకు కాబోయే భార్య కూడా బాలయ్య అభిమాని కావడంతో ఇద్దరు కలిసి తమ అభిమాని కోసం ఎదురుచూస్తున్నారు.
బాలయ్య చిన్నల్లుడు మార్గాని భరత్ ద్వారా తన కోరిక నెరవేరే అవకాశం ఉందని పెద్దినాయుడి భావించాడు. తన కోరికను మార్గాని భరత్ కు తెలియజేశాడు. తద్వారా బాలయ్యకు సమాచారం చేరేలా చేశాడు. తన వీరాభిమాని కోరికను తీర్చేందుకు బాలయ్య సిద్ధమయ్యాడు. పెద్ది నాయుడు పెళ్లికి వస్తున్నట్లు సమాచారం అందించాడు. బాలయ్య తన వివాహానికి రావడానికి అంగీకరించాడని తెలియడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశాడు.
వివాహ పత్రికలో తన పెళ్లి వివరాలతో పాటు బాలయ్య ఫోటోలను కూడా ముద్రించాడు. పెందుర్తిలో అదిరిపోయే ఏర్పాట్లు చేశాడు. ఊరి పెద్దల సహకారంతో బాలయ్యకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు సిద్ధమయ్యాడు. బాలకృష్ణ ఫోటోలతో కూడిన టీ షర్లులు, గొడుగులు తయారు చేయించాడు.