Architectural Digest Magazine: ప్రపంచ భవిష్య నగరాల్లో ఏపీ రాజధాని అమరావతి
Architectural Digest Magazine: ఏపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో ప్రపంచ ప్రతిష్టాత్మక మ్యాగజైన్ అర్కిటెక్చరల్ డైజెస్ట్ భవిష్యత్ నగరాల జాబితాను విడుదల చేసింది. రాబోయే 50 సంవత్సరాల్లో ప్రపంచం ఎలా ఉండబోతున్నదో తెలియజేస్తూ ఫ్యూచర్ సిటీస్ పేరుతో 6 నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ ఆరు నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమరావతి నగరం కూడా ఉండటం విశేషం. మెక్సికోకు చెందిన క్యాన్‌కున్ నగరం, చైనాకు చెందిన చెంగ్‌స్కై వ్యాలి, అమెరికాకు చెందిన టెలోసా నగరం, దక్షిణ కొరియాకు చెందిన ఓషియానిక్ బూసాన్ నగరం, సౌది అరేబియాకు చెందిన ది లైన్ నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమరావతి నగరాన్ని కూడా ఈ జాబితాలో చేర్చింది.
ప్రపంచ భవిష్యత్తులో నగరాలు ఏవిధంగా ఉంటాయో చెప్పేందుకు అమరావతి నగరం మచ్చుతునకగా ఉంటుందని అర్కిటెక్చరల్ డైజిస్ట్ మ్యాగజైన్ పేర్కొన్నది. ఢిల్లీలోని లూటెన్స్, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ స్పూర్తిగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నారని ఆ మ్యాగజైన్‌లో పేర్కొన్నది. గ్రీనరీతో పాటు వాటర్ ట్రావెలింగ్ ను కూడా ఈ నగరంలో తీర్చిదిద్దబొతున్నట్లు మ్యాగజైన్ పేర్కొన్నది. టీడీపీ ప్రభుత్వం హయాంలో అమరావతి నరగానికి శ్రీకారం చుట్టినా, వైసీపీ ప్రభుత్వం అమరావతి నగరానికి తిలోదకాలు ఇచ్చేసింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరావతి నగరంలో ఒక్క కట్టడం కూడా నిర్మించలేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసింది.