Andhrapradesh: ఏపీఎస్ ఆర్టీసీ లో నూతన అధ్యాయం భారీగా బస్సుల కొనుగోలు
Andhrapradesh: ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు తొలిసారి పడ్డాయి. భారీగా సొంత బస్సులు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2,736 కొత్త బస్సుల కొనుగోలుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో త్వరలోనే కొత్తగా 1,500 డీజిల్ బస్సులు, 1,000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇందులో 1,500 డీజిల్ బస్సులు నేరుగా ఆర్టీసీ కొనుగోలు చేయనున్నామని, 1,000 విద్యుత్తు బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నట్లు చెప్పారు
572కోట్ల వ్యయంతో 1,500 కొత్త డీజిల్ బస్సులు, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ – ఓపెక్స్ మోడల్ వెయ్యి ఎలక్ర్టానిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మరో 200 బస్సులను డీజిల్ నుంచి ఎలక్ర్టికల్ బస్సులుగా మార్చనున్నామన్నారు. త్వరలో కర్ణాటక తరహాలో 15 మీటర్ల అంబారీ బస్సుల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నామని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. ఇప్పటికే కర్ణాటక, ఒడిశా ఆర్టీసీలతో అంతర్రాష్ట్ర ఒప్పందం పూర్తయిందని, త్వరలో తెలంగాణ, తమిళనాడు ఆర్టీసీలతో కూడా ఒప్పందాలు చేసుకొని, ఏ రాష్ట్రంలో ఎన్ని కి.మీ. మేర తిరగొచ్చు అనేది చర్చించి తెలుపుతామని అన్నారు.