AP Jac: సంక్షేమ పథకాలుపేదలకు అందుతున్నాయంటే అందుకు ఉద్యోగులే కారణం..ఎపి అమరావతి జెఎసి చైర్మన్ బొప్పరాజు
AP Jac: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉద్యోగులపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా ఉన్నాయని ఎపి అమరావతి జెఎసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. ఉద్యోగులు పనిచేయడం లేదంటూ ఫ్లయింగ్ స్క్వాడ్‌ల పేరుతో తనిఖీలు చేయించడం సరికాదన్నారు.
కర్నూలు కలెక్టరేట్‌లోని పొదుపు భవన్‌లో ఎపి అమరావతి జెఎసి జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 5న కర్నూలులో నిర్వహించే అమరావతి జెఎసి రాష్ట్ర మూడవ వార్షికోత్సవ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు సరిగ్గా పని చేయడంలేదని ప్రభుత్వం భావించడం సరికాదని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు పేదలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయంటే అందుకు ఉద్యోగులే కారణమన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఉద్యోగులను దొంగలుగా భావించడం సరికాదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేతనైతే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అవుట్ సోర్సింగు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. వచ్చే నెల ఐదున జరిగే అమరావతి జెఎసి వార్షికోత్సవ సభకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు తరలిరావాలని కోరారు.