AP Special Status: ప్రధాని మోడీ ఏపీకి ఎందుకు వస్తున్నారు?: చలసాని శ్రీనివాస్
AP people once again demanding Special Status: ఆంధ్రప్రదేశ్ ని మోసం చేసిన ప్రధాని మోడీ ఇప్పుడు ఎందుకు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని ‘ఏపీకి ప్రత్యేక తరగతి, విభజన హామీల సాధన సమితి’ రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. మా పోర్టులను అదానీకి అప్పగించి, మీ అహంకారం చూపించడానికి వస్తున్నారా అని నిలదీశారు. ప్రధాని ఈ పర్యటనలో విభజన హామీల అమలు, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధాని రాష్ట్ర పర్యటన నేపథ్యంలో అన్ని రంగాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో విద్యార్థి, యువజన, మేధావుల ఫోరం, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఏపీ విభజన హామీల సాధన కోసం అన్ని (అధికార, ప్రతిపక్ష) పార్టీలు కలిసి రావాలని చలసాని శ్రీనివాస్ కోరారు.
‘ప్రత్యేక హోదా, హామీలను అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే సమయం వచ్చింది. అయినా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ పోరాడితే కలిసొస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. దయచేసి ముఖ్యమంత్రి ముందడుగు వేయాలి. ఆయన తనకు పాతిక మంది ఎంపీలను ఇవ్వండి అని ప్రజల్ని అడిగితే 32 మందిని ఇచ్చారు.
అయినా ఎందుకు వెనకాడుతున్నారు?. సీబీఐ, ఈడీ కేసులను చూసి భయపడుతున్నారా?. స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు తాకట్టుపెడుతున్నారు?. ఇప్పటికైనా మించిపోయిందిలేదు. అందర్నీ కలుపుకొని ప్రత్యేక హోదా కోసం పోరాడదాం. కలిసిరానివాళ్లు రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలకు మోడీ భజన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదు. ఏపీకి రైల్వే జోన్ ఇచ్చామన్నారు. ఆ జోన్ కి ఇప్పటివరకు అతీగతీ లేదు.
దీన్ని వదిలేసి మత కల్లోలాలను సృష్టిస్తున్నారు. కులాల మధ్య గొడవలు పెడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి మనకు మద్దతిస్తున్నారు. అయినా మన ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై లోక్ సభలో మారుమాట మాట్లాడటంలేదు. కేంద్రం ఏదైనా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా ఓటు వెయ్యండి. అంతేతప్ప ఆబ్సెంట్ కావొద్దు. ఏపీలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం కాదు. ఢిల్లీలో పోరాడాలి’’ అని చలసాని శ్రీనివాస్ సూచించారు.