Employees JAC: ఏపీ ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ అల్టిమేటం…
AP Revenue Employees JAC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగుల సంఘం జేఏసీ తాజాగా అల్టిమేటంను జారీ చేసింది. ఫిబ్రవరి 5 వ తేదీ లోగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఫిబ్రవరి 5 వ తేదీ వరకు డెడ్ లైన్ విధిస్తున్నామని, ఫిబ్రవరి 5 వ తేదీ వరకు తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఉద్యమం చేపడుతామని జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఆ హామీలను ఇప్పుడు అమలు చేయడం లేదని, హామీలను విస్మరించి తమ హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.
హామీల అమలుకోసం తాము ఉద్యమం చేస్తామని, ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా ఉద్యోగులను చులకన భావంతో చూస్తున్నారని కూడా ఆయన ఆగ్రమం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పాలనకు తాము వ్యతిరేకం కాదని, కాని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదన్నదే తమ బాధ అని అన్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు కావాలని మరోసారి ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ సంస్థల్లోని ఉద్యోగులు ఉద్యమానికి దిగితే ప్రభుత్వ పాలన స్థంబించిపోతుందని, రాష్ట్రానికి ఆదాయం రెవెన్యూ సంస్థల నుండే వస్తుందని అయన పేర్కొన్నారు.