AP PCC Chief on Chiranjeevi Politics: చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు
AP PCC Chief on Chiranjeevi Politics: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు బాధ్యతలు స్వీకరించిన తరువాత తన మార్క్ రాజకీయాలను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కారణం, సుమారు 16 పార్టీల ఒత్తడి ఉందని చెప్పుకొచ్చారు. చిరంజీవి రాజకీయాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, ఉంటారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇప్పటికీ ఆ సంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు. అయితే, చిరంజీవి సినిమా రంగంలో బిజీగా ఉండటం వలన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని కూడా రుద్రరాజు పేర్కొన్నారు.
చిరంజీవి మాత్రం తనకు రాజకీయాలు సరిపడటం లేదని, తమ్ముడు రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పడం వెనుక పరోక్షంగా పవన్ జనసేన పార్టీకి మద్ధతు ఇవ్వడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పుకొస్తున్నది. దీనికి కారణం లేకపోలేదు. చిరంజీవి ఆ పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకపోవడం కారణం కావొచ్చు. రుద్రరాజు అటు వైసీపీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోతో తాము ఎన్నికల్లోకి వెళ్లబోతున్నామని, రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత అని అన్నారు.