Jogi Ramesh: టీడీపీ, జనసేనలపై మంత్రి జోగి రమేశ్ సెటైర్లు
AP Minister Jogi Ramesh comments on TDP and Jana Sena
ఏపీ మంత్రి జోగి రమేశ్ మరోసారి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము పవన్ కళ్యాణ్ కు లేదని జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కొత్తగా చేసుకునే పొత్తు ఏముంటుందని సెటైర్లు వేశారు. చంద్రబాబును ఇంట్లో కౌగిలించుకున్న పవన్…బయట కౌగలించుకోవటమే మిగిలిందని జోగి రమేశ్ అన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబు, పవన్ ఇద్దరికీ లేదని అన్నారు. చంద్రబాబు, పవన్ పిరికివాళ్ళని జోగి రమేశ్ తేల్చారు. జగన్ ను ఎదుర్కోవాలంటే ధైర్యం ఉండాలని ఆ ధైర్యం ఇద్దరికీ లేదని జోగి రమేశ్ అన్నారు.
వారాహి వాహనానికి జరుగుతున్న పూజల విషయంలోను జోగి రమేశ్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ప్రజల రక్తాన్ని బలి కోరుతున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని అందుకే జీవో నెంబర్ 1 తీసుకు వచ్చామని మంత్రి తెలిపారు.
లోకేష్, పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తుంటే మేం ఆపామా? అని మంత్రి ప్రశ్నించారు. లోకేశ్ చేపట్టనున్న కార్యక్రమం యువగళంపై కూడా మంత్రి విమర్శలు చేశారు. లోకేశ్ చేస్తున్న పాదయాత్ర యువగళం కాదని టీడీపీకి ఇక మంగళమేనని ఎద్దేవా చేశారు.