AP: ఏపీలో సభలు, సమావేశాలను నిషేధించలేదు, క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స
AP Minister Botsa Satyanarayana clarification on the GO 1
జీవో 1 పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. చంద్రబాబు పర్యటనలకు లక్షలాది మంది ప్రజలు వస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జీవో 1 ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని అంటున్న వారు జీవోను ఒకసారి చదువుకోవాలని సూచించారు. జీవోలో ఎక్కడైనా సమావేశాలు, ర్యాలీలను నిషేధించినట్లు ఉందా? అని ప్రశ్నించారు. రోడ్ల మీద బహిరంగ సభలు పెట్టవద్దని మాత్రమే జీవోలో ఉందని మంత్రి బొత్స గుర్తుచేశారు. మరీ అవసరమైతే అనుమతి తీసుకుని పెట్టండి అని కూడా జీవోలో ఉందని గుర్తుచేశారు.
వైసీపీ స్లీపర్ సెల్స్ తొక్కిసలాట వలనే కందుకూరులో జనం చనిపోయారని చంద్రబాబు అనటం సిగ్గుచేటని బొత్స అన్నారు. అంతకంటే చంద్రబాబు దిగజారుడుతనం ఉంటుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బొత్స అన్నారు.
అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కూడా బొత్స పలు విమర్శలు చేశారు. చంద్రబాబు ఐడియాలజీలను పవన్ వెల్లడిస్తుంటాడని, అంతకు మించి పవన్ ఏం చేస్తాడని ప్రశ్నించారు.
లోకేష్ పాదయాత్ర వలన ప్రజలకు ఏం ఉపయోగం ఉంటుందని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు మోసం, కుట్ర, దగా తప్ప మరేం చేశారని నిలదీశారు. లోకేష్ కూడా అలాంటి వ్యక్తే అని బొత్స అన్నారు. చంద్రబాబు అధికారంలోకి ఉన్నప్పుడు అందరినీ మోసం చేశాడని గుర్తుచేశారు.